184
కృష్ణమూర్తి తత్వం
నిరంతరం మార్పు చెందుతూనే వుంటాయి. 'ఉన్నది' అంటే మార్పు. అది ఒక వాస్తవం 'ఉన్నది' అంటే అదీ.
ప్ర : అంటే, అప్పుడు ప్రేమ కూడా మార్పు చెందుతుంటుందా? ప్రతీదీ మార్పు అనే కదలికకు లోనవుతున్నప్పుడు, ప్రేమ కూడా యిటువంటి కదలికలోనిదేగా? ప్రేమ కూడా మారుతూ వుండేదయితే, అప్పుడు నేను యీ రోజు ఒక స్త్రీని ప్రేమించవచ్చు, రేపు మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు.
కృ : ప్రేమ అంటే అదేనా? ప్రేమ వేరూ, అది బయటకు వ్యక్తపరచడం వేరు అని మీరు అంటున్నారా? లేదూ ప్రేమకంటె, వ్యక్తం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం యిస్తున్నారా? ఆ విధంగా పరస్పర వైరుధ్యాలనూ, సంఘర్షణనూ సృష్టిస్తూ. ప్రేమ మార్పు అనే చక్రంలో చిక్కుకొని పోతుందా? అప్పుడది ద్వేషంగా కూడా అయిపోవచ్చు. అప్పుడు ప్రేమ అంటే ద్వేషం. ఏ భ్రాంతులూ లేనప్పుడే 'వున్నది' అత్యంత పవిత్రమైనది. ఏ భ్రాంతీ లేనప్పుడు 'వున్నది' ని దేవుడనవచ్చు, లేదూ మీకిష్టమైన మరొక పేరు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి, దేవుడు కాని, మీరు పెట్టుకున్న మరొక పేరు కానీ మీరు లేనప్పుడే వుంటాడు. మీరు వున్నప్పుడు అది వుండదు. మీరు లేనప్పుడు ప్రేమ వుంటుంది. మీరు వుంటే ప్రేమ వుండదు.
(ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్)
బాధ
ప్రశ్నిస్తున్నవారు : నా జీవితకాలమంతా ఎన్నో బాధలతో గడిపినట్లుగా నాకనిపిస్తున్నది. శారీరకమైనవి కావు, మరణం చూశాను. ఒంటరితనం అనుభవించాను. బ్రతుకు వట్టి నిరర్ధకం అనిపించింది ఎన్నోసార్లు. నాకు ఒక కొడుకు. వాడిని ఎంతగానో ప్రేమించాను. ఒక ప్రమాదంలో చనిపోయాడు. నా భార్య నన్ను వదలి వెళ్ళిపోయింది. ఆ విషయం నన్ను అమితంగా కలవరపరచింది. చాలామంది మా వర్గం మనుష్యుల్లాగే నాకూ కొంత డబ్బు, స్థిరమైన వుద్యోగం వున్నాయి. నా పరిస్థితులను గురించి నేను వాపోవడంలేదు. అయితే దుఃఖం అంటే ఏమిటి, అదీ అసలు ఎందుకు కలుగుతున్నది, అనేది నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. దుఃఖం అనుభవించడం ద్వారా వివేకం వస్తుందని అందరూ అంటారు. కాని అందుకు విరుద్ధంగా జరుగుతుందని నేను అంటున్నాను.