Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దినచర్య వృత్తాంతాలు, లేఖరులకు చెప్పి వ్రాయించినవి, ఉత్తరాలు

173

రకరకాల మారువేషాలనూ వేసుకోవచ్చు. మీరు ఒక రాజకీయవేత్త కనుక అయితే, మీ స్వార్థం అధికారాన్నీ, హోదానీ, ప్రజాభిమానాన్నీ కోరుకుంటుంది. ఒక సిద్ధాంతానికో, సేవాసంస్థకో తనని అంకితం చేసుకుంటుంది. ఇవన్నీ ప్రజలకు మేలు చేయడం కోసమే అనీ అంటుంది. మీరు కనుక ఒక నియంత అయితే, యితరుల మీద అతి కర్కశత్వంతో పెత్తనం చెలాయించడంలో అది వ్యక్తమవుతుంది. మీకు మతపరమైన విషయాలమీద అభిరుచి వుంటే, అప్పుడది ఆరాధనగానో, భక్తిగానో, ఒక నమ్మకాన్ని గాని, ఒక అంధవిశ్వాసాన్ని గాని గట్టిగా పట్టుకొని కూర్చోవడంలోనో తనని బయటకు వ్యక్తపరచుకుంటుంది, కుటుంబాల్లో కూడా స్వార్థం పనిచేస్తూ వుండటం చూడవచ్చు. తండ్రి జీవితం గడిపే పద్దతిలో అతని స్వార్థమే కనబడుతుంది. తల్లి అయినా అంతే. లోలోపల ఆజ్ఞాతంగా దాగి, విస్తరించుకుంటూ పోయే యీ స్వార్థానికి కీర్తి, ఐశ్వర్యం, అందచందాలు అనేవి ఆధారం. మతాచార్యుల చుట్టు ఉండే అధిష్టానశ్రేణీ స్వరూపంలో కూడా యిది వుంటుంది. వారే సృష్టించుకున్న ఒక ప్రత్యేకమైన దేవుడి బొమ్మ మీద తమకు గల భక్తిని, ప్రేమను వారు ఎంత గొప్పగా ప్రకటించుకున్నా సరే, అక్కడా యీ స్వార్థం వుంటుంది. గొప్ప గొప్ప పారిశ్రామిక అధినేతలలోనూ, ఒక పేద గుమాస్తాలోనూ కూడా క్షణ క్షణం విస్తరించిపోతూ, మనిషిని మొద్దుబారేటట్లు చేసే యీ స్వార్థం అనే యింద్రియలోలత్వం వుంటుంది. ఈ లౌకిక జీవనాన్ని పరిత్యజించిన సన్యాసి అయినా సరే, అతను ప్రపంచమంతా బైరాగిలా పర్యటిస్తుండవచ్చు గాక, లేదూ ఆశ్రమంలో ముక్కు మూసుకొని కూర్చుండవచ్చు గాక, అతనయినా తన లోపల అంతూ పొంతూ లేకుండా జరిగే యీ స్వార్ధపు కదలికలను మాత్రం వదుల్చుకోలేడు. వాళ్ళు తమ పేర్లు మార్చుకోవచ్చు, కాషాయ వస్త్రాలు ధరించవచ్చు, బ్రహ్మచర్య వ్రతమో, మౌనవ్రతమో పాటించవచ్చు. అయినాసరే, ఒక ఆదర్శమో, ఒక వూహా ప్రతీమో, ఒక చిహ్నమో వారిని లోలోపల దగ్ధం చేస్తూ వుంటుంది.

విజ్ఞానశాస్త్రవేత్తల్లో, తాత్వికుల్లో, విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యుల్లో కూడా యిది లేకుండా వుండదు. మంచి పనులు చేసే పరోపకారశీలురు, మహాత్ములు, గురూజీలు, పేదలకోసం అహర్నిశలు శ్రమిస్తున్న స్త్రీ, పురుషులు - వీళ్ళందరూ కూడా పనిలో మునిగిపోయి తమని తాము మరిచిపోవాలని కోరుకుంటారు. అయితే ఆ పని కూడా వారి స్వార్ధంలోని భాగమే. తమ అహంకారాన్ని వాళ్ళు తమ కృషిలోకి మళ్ళించారు. ఇది చిన్నతనంలోనే ఆరంభమవుతుంది. వృద్ధాప్యంలో కూడా కొనసాగుతూనే వుంటుంది. తన జ్ఞానం చూసుకొని గర్వించేవాడు, దొంగ వినయాన్ని అభ్యాసం చేసి అలవరచుకున్న నాయకుడు, విధేయురాలైన భార్య, పెత్తనం చెలాయించే మగవాడు