పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దినచర్య వృత్తాంతాలు, లేఖకులకు చెప్పి వ్రాయించినవి, ఉత్తరాలు

169


మీకు ఏం జరుగుతున్నది అన్న స్పృహ మీకేమాత్రమైనా కలిగితే, వినోద కాలక్షేపాల ప్రపంచం, క్రీడా ప్రపంచం మీ మనసుని ఎట్లా పట్టివుంచుతున్నాయి, మీ జీవితాన్ని ఏవిధంగా మలుస్తున్నాయి అన్న సంగతి మీరు ఆలోచించాలి. ఇదంతా దేనికి దారితీస్తున్నది? బహుశ యిదంతా మీకు అసలు అక్కర్లేదేమో? బహుశ మీకు రేపటి గురించి లెక్ఖ లేనేలేదేమో. బహుశ దాన్ని గురించి మీరిప్పుడు ఆలోచించలేదేమో. ఒకవేళ ఆలోచించినా - అది మహా సంక్లిష్టమైనదీ, తలుచుకుంటేనే భయం వేస్తుందీ, రాబోయే కాలాన్ని గురించి ఆలోచించడం చాలా ప్రమాదకరం - అనీ అంటారేమో. ఇది ప్రత్యేకంగా మీ ఒక్కరి వృద్ధాప్యం గురించి కాదు. విధిబలీయతను గురించి - ఆ పదం వుపయోగించవచ్చు, ఫరవాలేదు అంటే, ఇప్పుడు మనం గడుపుతున్న జీవిత విధానానికి - అంటే రకరకాల కాల్పనిక భావాలతో, వుద్రేకాలతో, వుద్విగ్నాను భూతులతో, వ్యాపకాలతో కూడుకున్న మొత్తం వినోదప్రపంచం అంతా కలసి మనసు మీద దండెత్తుతున్న - యీ జీవిత విధానానికి పర్యవసానం చివరకు ఏమిటి? దీనంతటినీ గురించిన స్పృహ మీకు వుందో లేదో! మానవాళికి భవిష్యత్తులో ఏముంది?

ఇంతకు ముందే మేము చెప్పినట్లుగా, ప్రస్తుతం మీరు ఏమిటో అదే మీ భవిష్యత్తు. ఏ మార్పూ కనుక జరగకపోతే రకరకాల రాజకీయ, మత, సామాజిక విధానాలకి అనుగుణంగా పైపైన చేసుకునే సద్దుబాట్లు కాదు, పై పైన జరుపుకునే దిద్దుబాట్లు కాదు బాగ గాఢమైన లోతుల్లో వచ్చే మార్పు. ఇటువంటి మార్పు జరగాలంటే మీ పూర్తి ధ్యాస, మీ శ్రద్ద, మీ వాత్సల్యం దానిమీద తప్పక వుండితీరాలి. ఇటువంటి మౌలికమైన మార్పు వస్తే తప్ప ప్రస్తుతం ప్రతిరోజూ మన జీవితాల్లో మనం ఏంచేస్తున్నామో అదే మన భవిష్యత్తు కూడా అవుతుంది. మార్పు అనే మాటలోనే కొంత క్లిష్టత వుంది. మార్పు చెంది ఏమవాలి? మరొక కొత్త నమూనాకి మారడమా? ఇంకొక ప్రతిపాదనకో మరో రాజకీయ విధానానికో మత విధానానికో మారడమా? దీన్నుంచి దానికి మారడమా? అది కూడా యీ పరిధిలోనిదే; 'ఉన్నది' అనే రంగంలో వుంటుంది. ఇటువంటి మార్పును చిత్రించేది ఆలోచనే. దానిని సూత్రీకరించేదీ, వస్తుప్రపంచానికి సంబంధించినదిగా స్థిరపరచేదీ ఆలోచనే.

కాబట్టి, మార్పు అనే యీ మాటను గురించి జాగ్రత్తగా పరిశోధించాలి. ఒక ప్రయోజనాన్ని ఆశించినప్పుడు అది మార్పు అవుతుందా? ఒక ప్రత్యేకమైన మార్గంలో, ఒక ప్రత్యేకమైన ఫలితం కోసమూ, తెలివిగా, హేతుబద్ధంగా అనిపించే ముగింపు కోసమూ జరిగినప్పుడు అది మార్పు అవుతుందా? బహుశ దీనీకంటే సరియైన పదప్రయోగం ఏమిటంటే, 'ఉన్నది ని సమాప్తం చేయడం' అంటే 'వున్నది' నుంచి “వుండవలసినది' కి పోవడం కాదు. మార్పు అంటే అది కాదు. మార్పు అంటే సమాప్తం