పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

కృష్ణమూర్తి తత్వం


ఆ వుదయం మబ్బుల్లో మెరుపులు తెగ మెరుస్తున్నాయి. వర్షం బాగా పడే సూచనలున్నాయి. గత కొద్ది వారాలుగా వర్షం కురుస్తూనే వుంది. ఇక్కడ ఒక చెరువులాంటిది తయారుచేశారు. అందులో నీళ్ళు నిండిపోయి అంచులదాకా వచ్చాయి. ఆకుపచ్చని ఆకులు, పొదలు, ఎత్తయిన చెట్లు అన్నీ ఎండకోసం ఎదురుచూస్తున్నాయి. కేలిఫోర్నియాలో సాధారణంగా కాసే తీవ్రమైన ఎండ వంటి ఎండ రానేలేదు. సూర్యుడు తన ముఖం చూపించి చాలారోజులైంది.

మానవాళికి భవిష్యత్తులో ఏమున్నదో అని అనిపిస్తూ వుంది. అక్కడ కనబడుతున్న ఆ పిల్లల భవిష్యత్తులో - అరుస్తూ, ఆడుకుంటూ, ఎంతో సంతోషంగా, ఎంతో సౌమ్యం, ముద్దుగా వున్న ఆ పిల్లల భవిష్యత్తులో ఏముందో? ఇప్పుడు మనం ఏమిటో అదే మన భవిష్యత్తు. చారిత్రకంగా చూస్తే అనేక వేల సంవత్సరాలుగా జరుగుతున్నదీ యిదే. బ్రతకడం, చనిపోవడం, జీవించడానికి మనం పడే ప్రయాసా - అంతే. భవిష్యత్తు గురించి మనం అంతగా పట్టించుకున్నట్లు కన్పించదు. పొద్దున లేచిందగ్గర్నుంచీ రాత్రి పడుకునేవరకు అంతులేని వినోదకార్యక్రమాలు మీరు టెలివిషన్లో చూస్తూ వుంటారు. ఒకటి రెండు ప్రసారకేంద్రాల్లో మినహాయించి; అవైనా చాలా కొద్దిసేపే వుంటాయి; పైగా అంతగా లోతయిన విషయాల గురించీ వుండవు. పిల్లలకు కాలక్షేపం అయిపోతూ వుంటుంది. మీకు చాలా వినోదం కలుగుతున్నదనే విషయాన్ని వ్యాపారప్రకటనలు- మరీ మరీ జ్ఞాపకం చేస్తుంటాయి. దాదాపుగా ప్రపంచం అంతటో యిదే జరుగుతున్నది. ఈ పిల్లలందరూ భవిష్యత్తులో ఏమైపోతారు? క్రీడారంగానికి సంబంధించిన కార్యక్రమాలుంటాయి . కొద్దిమంది ఆడుతుంటే ముప్పయి, నలభై వేలమంది ప్రేక్షకులు చూస్తుంటారు. గొంతులు చించుకొని అరుస్తుంటారు. ఒక గొప్ప చర్చీలో జరుగుతున్న పూజా కాండనీ కూడా మీరు చూస్తుంటారు. అది ఒక రకమైన వినోద కాలక్షేపమే. కాకపోతే అదంతా చాలా పవిత్రమైనది, మతానికి సంబంధించినది అంటారు - వుద్విగ్నపూరితమైన, భావగర్భితమైన అనుభూతి, మత ధర్మపరమైన అనుభూతి ఇట్లా ఎన్ని పేర్లు పెట్టినా అదంతా వినోదకాలక్షేపమే. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతూ వున్న యిదంతా గమనిస్తున్నప్పుడు, వుల్లాసం కలిగించే వేడుకలతోను, వినోదాలతోను, క్రీడలతోను రకరకాలైన యీ వ్యాపకాలతోను మనసును నింపుకోవడం గమనిస్తున్నప్పుడు ఏమాత్రం అక్కర వున్న వారయినా తప్పకుండా అడగవలసిన ప్రశ్న ఏమిటంటే - భవిష్యత్తులో ఏముంది? ఇప్పుడున్నదే కొత్త కొత్త రూపాలు ధరించి యింకా ఎక్కువవుతుందా? రకరకాలైన వినోద కాలక్షేపాలా?