దినచర్య వృత్తాంతాలు, లేఖకులకు చెప్పి వ్రాయించినవి, ఉత్తరాలు
167
మబ్బులతో ఒక గాఢమైన, సుస్థిరమైన, దీర్ఘకాల బాంధవ్యాన్ని మనం నెలకొల్పుకో గలుగుతే - నెలకొల్పగలగటం కాదు, నెలకొల్పి తీరాలి - అప్పుడు ఎటువంటి కారణం కోసమైనా సరే, మరొక మనిషిని చంపలేము. యుద్ధం అంటే వ్యవస్థీకృతం చేసిన హత్యలు. ఏదో ఒక ప్రత్యేకమైన యుద్ధానికి - అణుయుద్ధానికో, మరొకరకమైన యుద్ధానికో వ్యతిరేకంగా మనం ప్రదర్శనలు జరుపుతాం తప్ప. అసలు మొత్తం యుద్ధాలనే నిరసిస్తూ ప్రదర్శనలు ఎన్నడూ జరపలేదు. తోటి మానవుడిని చంపడం అనేది యీ భూప్రపంచం మొత్తంలోకల్లా అత్యంత పాపకార్యం అని మనం ఏనాడూ ఘోషించలేదు.
('కృష్ణమూర్తి టు హిమ్ సెల్ఫ్')
మానవాళి భవిష్యత్తులో ఏమున్నది?
పక్షులకోసం వుంచిన ఆహారపు తొట్టెమీద ఒక పది, పన్నెండు పిట్టలు వాలి కిచకిచలాడుతూ, ఒకటి నొకటి నెట్టుకుంటూ గింజలు ఏరుకోవడానికి అవస్థ పడుతున్నాయి. మరో పెద్ద పక్షి వచ్చి వాలేసరికి, రెక్కలు టప టప కొట్టుకుంటూ యివన్నీ ఎగిరిపోయాయి. ఆ పెద్ద పక్షి ఎగిరిపోగానే మళ్ళీ ఆన్నీ వచ్చి చేరాయి. మళ్ళీ కలకలా రావాలు చేస్తూ, కొట్లాడుకుంటూ, కిచకిచమంటూ మొత్తంమీద విపరీతంగా గోలచేస్తున్నాయి. అంతలోనే ఒక పిల్లి అటుగా వచ్చింది. పిట్టలన్నీ కలవరపడిపోయి, కీచు కీచుమంటూ అరచి నానా హంగామా చేశాయి. ఎట్లాగయితేనేం ఆ పిల్లిని తరిమేశాయి. అది పెంపుడు పిల్లే కాదు, అడవి జాతికి చెందినది. రకరకాల రంగుల్లో, ఆకారాల్లో, చిన్నా, పెద్దా అడవిపిల్లులు యీ చుట్టుప్రక్కల చాలానే వున్నాయి. ఆహారపు తొట్టె చుట్టూ రోజు పొడుగూతా పిట్టలు వాలుతూనే వున్నాయి, చిన్న చిన్నవీ పెద్దవీ కూడా. మధ్యలో ఒక నీలిరంగులో వున్న పాలపిట్ట వచ్చింది. అందరిమీదో, మొత్తం ప్రపంచం మీదే అరుస్తూ కేకలు పెట్టింది. తన అరుపుల్లో తక్కిన పిట్ట లన్నింటినీ తరిమి పారేసింది. నిజం చెప్పాలంటే అది రావడం చూసి అవే పారిపోయాయి. ఈ పిట్టలన్నీ పిల్లులొస్తాయేమోనని జాగ్రత్తగా కని పెట్టి వుంటాయి. సాయంత్రం అవుతున్నకొద్దీ ఒక్కటొక్కటిగా అన్నీ ఎగిరిపోయాయి. అంతటా నిశ్శబ్దం, నెమ్మది, ప్రశాంతత అలముకుంది. పిల్లులు వచ్చాయి, వెళ్ళాయి. కానీ పిట్టలు అక్కడ లేవు.