Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

161

ప్రయోగించడం కాదు. నిర్బంధంవల్ల ప్రతిరోధించడం బయలుదేరుతుంది. మనసు వేగాన్ని తగ్గించడానికీ యీ విదంగా శక్తిని వృధాచేయడం జరగకూడదు. అంతేనంటారా కాదా?

“ఆలోచనను అదుపుచేయడం అనే ప్రయత్నం అంతా వ్యర్ధ ప్రయాస అని యిప్పుడిప్పుడే నేను గ్రహిస్తున్నాను. అయితే అసలు చేయవలసిందేమిటో నాకు అర్థంకావడం లేదు.”

ఏం చర్య తీసుకోవాలనేదాకా మనం యింకా రాలేదు. అవునా? మనసు వేగం తగ్గించుకోవడం చాలా ముఖ్యం అనేది గ్రహించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. వేగం ఎట్లా తగ్గించాలి అనే సంగతిని కాదు. మనసు వేగం తగ్గించుకోగలదా? అది ఎప్పుడు జరుగుతుంది?”

'నాకు తెలియదు. దీన్ని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.”

సర్, ఏదయినా ఒకదాన్ని మీరు అప్రమత్తంగా చూస్తున్నప్పుడు మనసు వేగం తగ్గిపోతుందని మీరు గమనించలేదా? ఆ దారిమీదుగా కారు పోతూండటం మీరు జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, ఏదయినా ఒక వస్తువును బాగా పరిశీలనగా మీరు చూస్తున్నప్పుడు, మీ మనసు చాలా మెల్లిగా పనిచేయడంలేదూ? గమనించడం, పరిశీలించడం మనసు వేగాన్ని తగ్గిస్తాయి. ఒక చిత్రపటంవైపు కానీ, ఒక ప్రతిమవైపు కానీ, ఒక వస్తువువైపు కానీ చూస్తూ వుండటం మనసు నెమ్మదిగా అవడానికి తోడ్పడుతుంది. అట్లాగే కొన్ని పదాలను మళ్ళీ మళ్ళీ పునరుక్తి చేయడం కూడా. అయితే అప్పుడు ఆ వస్తువు, ఆ పదాలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. మనసు వేగం తగ్గించుకోవడం అన్నదానిని, తరువాత ఏం కనిపెడతాము అన్నదానిని మీరు వదిలేస్తారు.

'మీరు వివరిస్తున్న దానిని నేను గమనిస్తున్నాను. మనసు నిశ్చలంగా అయిన ఎరుక కలిగింది.'

ఏ విషయాన్నయినా మనం నిజంగా గమనిస్తామా? రకరకాల అపోహలతో, ప్రమాణాలతో, తప్పొప్పుల నిర్ణయాలతో, పోల్చిచూడటాలతో, నిరసించడాలతో నిర్మించిన ఒక తెరను పరిశీలకుడికి, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన దించి చూస్తామా.

'ఇటువంటి తెర లేకుండా చూడటం సాధ్యం కాదు. అటూ యిటూ ఏమాత్రం అతిక్రమించని తీరులో పరిశీలించగలగడం నాకు చేతనవుతుందనుకోను.'