Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

కృష్ణమూర్తి తత్వం

సముద్రంలాగా మహా అశాంతంగా వుంటుంది. చాలా సంక్లిష్టమైన, అత్యంత జటిలమైన యీ యంత్రంలోని మొత్తం కదలికలన్నింటినీ ఒక భాగం అదుపు చేయాలని చూస్తుంది. దానితో పరస్పర వ్యతి రేకమైన కోరికల మధ్య, కాంక్షల మధ్య సంఘర్షణ బయలుదేరుతుంది. వాటికి వున్నతాత్మ, నీచాత్మ అని మీరు పేర్లు పెట్టవచ్చు. అయితే రెండూ మనసు ఆవరణలోనివే. మనసులో, ఆలోచనల్లో జరిగే చర్య, ప్రతిచర్యలు రెండూ దాదాపుగా ఒక్కసారే, చాలావరకు యాంత్రికంగా వాటంతట అవే జరిగిపోతుంటాయి. తెలిసి జరిగేవీ, అచేతనంగా జరిగేవీ అయిన బూ మొత్తం ప్రక్రియలు అంటే అంగీకరించడం, నిరాకరించడం, లొంగిపోవడం, స్వేచ్ఛకోసం ప్రయాసపడటం యివన్నీ అమిత వేగంతో జరిగిపోతుంటాయి. కాబట్టి అసలు ప్రశ్న యీ మహా సంక్లిష్టమైన యంత్రాన్ని ఎట్లా అదుపుచేయాలన్నది కాదు; ఎందుకంటే అదుపు చేయడం అనగానే ఘర్షణ వస్తుంది. దానివల్ల శక్తి వృధా అవుతుంది. అయితే అతి వేగంతో పరుగులు పెడుతున్న యీ మనసు తన వేగాన్ని తగ్గించుకోగలదా?

"కాని, ఎట్లా?"

సర్, దయచేసి ఏమీ అనుకోకండి, అసలు సమస్య 'ఎట్లా' అని కానేకాదు. 'ఏవిధంగా' అనేది కేవలం ఒక ఫలితాన్ని మనకి యిస్తుంది. ఆ చిట్ట చివరి ఫలితానికి ఏ ప్రాముఖ్యమూ లేదు. ఈ ఫలితాన్ని సాధించుకున్నా యింకొక కోరిక ఫలించడం కోసం మళ్ళీ ఒక అన్వేషణ మొదలవుతుంది. దానితోపాటుగా వుండే సంఘర్షణ, వ్యధ తప్పవు.

“అయితే యిప్పడు మనం చేయవలసింది ఏమిటి?”

మీరు సరియైన ప్రశ్న అడగడంలేదు, అవునా? మనసు తన వేగాన్ని తగ్గించుకోవడంలోని సత్యాసత్యాలు కని పెట్టడం పోయి, ఒక ఫలితం రాబట్టాలని మీరు ఆరాటపడుతున్నారు. ఫలితాన్ని సాధించడం కొంతవరకు సులువే, కాదూ? కట్టి పడవేసి ఆపడం ద్వారా కాకుండా మరో విధంగా తన వేగాన్ని తగ్గించుకోవడం మనసుకి సాధ్యపడుతుందా?

“వేగం తగ్గించుకోవడం అంటే అర్థం ఏమిటి?"

కారులో చాలా వేగంగా పోతున్నప్పుడు చుట్టూ వుండే దృశ్యాలు మసక మసగ్గా కనిపిస్తాయి. నడుస్తూ వెళ్తున్నప్పుడుండే వేగంలో మాత్రమే చెట్లనీ, పక్షులని, పూలని మీరు వివరంగా పరిశీలించగలుగుతారు. మనసు వేగం తగ్గించుకున్నపుడు స్వీయజ్ఞానం కలుగుతుంది. అంటే అర్ధం వేగం తగ్గించమని మనసుమీద వొత్తిడి