పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

కృష్ణమూర్తి తత్వం

అనుకుంటే అది చేయడానికి ఆమెకు తోడ్పడాలనుకుంటున్నారు. ఇబ్బంది ఎక్కడంటే అసలు ఏది మంచిది అనేది కనుక్కోవడం ఎట్లా? అమెకే అంత నిర్ధారణగా తెలియడంలేదు. ఆమెకి అంతా అలజడిగాను, తారుమారుగాను అనిపిస్తున్నది. కాని తక్షణమే చర్య తీసుకోవలసిన వొత్తిడి కూడా ఎక్కువగా వుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక ఎక్కువ కాలం యిట్లాగే పొడిగించడానికి వీల్లేదు. ఒకానొక బాంధవ్యాన్నుంచి విడుదల చెందాలన్నదే ప్రస్తుత సమస్య. ఆమెకి స్వేచ్ఛ కావాలి, ఈ మాట అనేకసార్లు ఆమె మళ్ళీ మళ్ళీ అంటూ వచ్చారు.

గదిలో అంతా ప్రశాంతంగా వుంది. అందరిలోనూ అసహనం, ఆందోళన నెమ్మదించాయి. సమస్యను గురించి చర్చించాలని వాళ్ళంతా చాలా ఆత్రంగా వున్నారు. అయితే దానివల్ల ఫలితం వుంటుందని కాని, ఏది సరియైన కర్తవ్యం అన్నదానికి ఒక నిర్వచనం లభిస్తుందని కాని వాళ్ళు ఆశించడంలేదు. సమస్య పూర్తిగా బయటకు వ్యక్త మయాక కర్తవ్యం ఏమిటో దానంతట అదే సహజంగా, సంపూర్ణంగా వెల్లడవుతుంది. సమస్య లోపల వున్న విషయాన్ని కనిపెట్టడం ప్రధానం కాని, చివరకు కలిగే ఫలితం ముఖ్యం కాదు. ఎందుకంటే చివరికి ఏ సమాధానం వచ్చినా సరే అది కూడా ఒక తీరో, ఒక అభిప్రాయమో, యింకొక సలహానో అవుతుందే తప్ప అసలు సమస్యని ఏవిధంగానూ ఆది పరిష్కరించలేదు. సమస్యని సమస్యగా అవగాహన చేసుకోవాలి తప్ప, ఆ సమస్యకు ఎట్లా ప్రతిస్పందించాలి, ఆ విషయంలో ఏం చేయాలి అన్నవి ముఖ్యం కాదు. సమస్యను సవ్యమైన దృష్టితో దరిచేరడం ముఖ్యం. ఎందుకంటే సమస్యలోనే చేయదగిన కర్తవ్యం నిబిడీకృతమై వుంటుంది.

సూర్యుడు నదిలోని నీళ్ళ పై వెలిగించిన కాంతిరేఖలు నీళ్ళను పులకింపజేసి నాట్యం చేయిస్తున్నాయి. తెల్లని తెరచాపతో ఒక పడవ ఆ దారినే వెళ్ళింది. కాని నాట్యం మాత్రం ఆగిపోలేదు. స్వచ్ఛమైన ఆనందపారవశ్యంతో చేస్తున్న నృత్యం అది. చెట్లనిండా పక్షులు వాలి వున్నాయి. గట్టిగా అరుస్తూ, ముక్కులతో పొడిచి యీకలు సవరించుకుంటూ, కాసేపు అటూ యిటూ ఎగిరి, మళ్ళీ వచ్చి వాలుతూ సందడి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా కోతులు - లేత ఆకులు తెంపి నోళ్ళల్లో కుక్కుకుంటూ అల్లరి చేస్తున్నాయి. ఆ కోతుల బరువువల్ల సన్నగా లేతగా వున్న కొమ్మలు ఆర్థచంద్రాకారాల్లో వంగిపోయాయి. అయినా కోతులు ఏమాత్రం భయపడ కుండా కొమ్మల్ని పట్టుకొని తేలిగ్గా వేలాడుతున్నాయి. ఎంతో సునాయాసంగా ఒక కొమ్మమీద నుంచి యింకో కొమ్మమీదికి మారుతున్నాయి. అవి ఎగరడమూ, మరో కొమ్మ మీదికి దూకడమూ రెండూ కలిసిపోయి ఒకే ఒక కదలికలాగా అనిపిస్తున్నది. తోకలు కిందకు వేళ్ళాడేసుకొని కూర్చుని, ఆకులు అందుకుంటున్నాయి. బాగా పై