రచనలు
151
వడం కాదు. పలాయనాలన్నీ తెలివి తక్కువ వల్ల జరిగేవే. ఎందుకంటే వాటి వలన సంఘర్షణతప్పకుండా పుడుతుంది. నిర్మమకారంగా వుండటం అలవాటు చేసుకోవడం యింకొక రకమైన పలాయనమూ, ఏకాంతవాసమూ అవుతుంది. అది మళ్ళీ ఆకారం లేనీ ఒక భావన మీద, ఒక ఆదర్శం మీద మమకారం పెంచుకోవడం అవుతుంది. ఆదర్శం కాల్పనికమైనది. అహం తయారుచేసినది. ఆదర్శాన్ని అందుకోవడం అంటే 'వున్నది' నుంచి పారిపోవడమే. మనసు ఏరకమైన పలాయనాన్నీ కోరుకోకుండా వున్నప్పుడు మాత్రమే 'వున్నది' ని అవగాహన చేసుకోవడం, 'వున్నది' కి సంబంధించి సముచితమైన చర్య చేయడం జరుగుతాయి. 'ఉన్నది' గురించి ఆలోచించడం కూడా 'వున్నది' నుంచి పారిపోవడమే. సమస్య గురించి ఆలోచించడం అంటే సమస్య నుంచి పారిపోవడం. ఎందుకంటే ఆలోచించడమే సమస్య. అసలు సమస్య అదే. మనసు తను ఏమిటో అట్లా వుండటం యిష్టపడదు కాబట్టి, తను ఏమిటో అది అంటే భయపడుతుంది కాబట్టి, యీ రకరకాల పలాయనాలు వెతుక్కుంటుంది. పలాయనానికి దారితీసేది ఆలోచన. ఆలోచన వున్నంతవరకు పలాయనాలు, మమకార బంధాలు వుండి తీరుతాయి. వాటివల్ల నిబద్ధీకరణం యింకా గట్టిపడుతుంది.
ఆలోచించడం నుంచి విముక్తి పొందడం ద్వారా నిబద్ధీకరణం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. మనసు సంపూర్ణమైన నిశ్చలతతో వున్నప్పుడు మాత్రమే యదార్ధమైనది వుండటానికి కావలసిన స్వేచ్ఛ లభిస్తుంది.
(కమెంటరీస్ ఆన్ లివింగ్ ; సెకండ్ సిరీస్)
స్వాభిమానం
ఆమె తన ముగ్గురు స్నేహితులని వెంటబెట్టుకొని వచ్చింది. వాళ్ళందరిలోనూ మంచి ఆసక్తి, తెలివితేటలవల్ల నొనగూడే హుందాతనమూ వున్నాయి. వారిలో ఒకరికి చాలా త్వరగా గ్రహించగలిగే శక్తి వున్నది; మరొకరిలో చురుకుదనంతోపాటు అసహనం కూడా వుంది; మూడో వారిలో వుత్సాహం వుంది కానీ అది ఎక్కువ సేపు కొనసాగే వుత్సాహం కాదు. మంచి మిత్రబృందం అది. తమ స్నేహితురాలి సమస్య గురించి వారందరిలోనూ విచారం వుంది. అయితే ఎవ్వరూ సలహాలు కాని, బరువైన అభి ప్రాయాలు కాని వెలిబుచ్చడంలేదు. సంప్రదాయానికో, పదిమంది అభిప్రాయానికో, వ్యక్తిగతమైన అభిలాషకో అనుగుణంగా కాకుండా ఏది చేస్తే మంచిది అని ఆమె