రచనలు
149
‘సూటిగా అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడుగా వున్న సమాధానం కాదా యిది?'
అట్లాగా? మీరు నిబద్దులై వున్నారనే ఎరుక పొందడానికి ప్రయత్నించి చూడండి. వరోక్షంగా, మరొక దానితో సంబంధించిన అంశంగా మాత్రమే దానిని తెలుసుకోగలుగుతారు. దేనిమీదా ఆధారపడని, కేవలం ఒక సిద్ధాంతంలాగా మీ నిబద్ధీకరణాన్ని గురించి తెలుసుకోలేరు. అప్పుడది ఒక మాట, ఒక శబ్దం అవుతుందే తప్ప అంతకంటే గొప్ప అర్ధం అందులో కనిపించదు. మనకు ఒక్క సంఘర్షణను గురించే తెలుసు. సమస్యకూ ప్రతిస్పందనకూ మధ్యన సమైక్యత లేనప్పుడు సంఘర్షణ కలుగుతుంది. ఈ సంఘర్షణ మన నిబద్ధీకరణానికి పర్యవసానం. నిబద్దీకరణం అంటే మమకార బంధం. మన పనితో, సంప్రదాయంతో, ఆసక్తితో, మనుష్యులతో, సిద్ధాంతాలతో యింకా ఎన్నో యిటువంటి వాటితో మనకు వుండే మమకార బంధం. ఈ మమకారమే కనుక లేకపోతే నిబద్దీకరణం వుంటుందా? ఉండనే వుండదు. మరి అప్పుడు మనం ఎందుకీ మమకారం పెంచుకుంటాం? నా దేశం మీద నాకు మమకారం; ఎందుకంటే దేశం పేరు చెప్పుకుంటే గాని నాకో గుర్తింపు వుండదు. నేను చేస్తున్న పనివల్ల నాకు ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ పని నాకు చాలా ప్రధానమైపోతుంది. నేను అంటే నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు. వాటిమీద నాకు మమకారం. నా లోని ఖాళీతనాన్నుంచి నేను దూరంగా పారిపోవడానికి, నేను మమకారం పెంచుకున్న విషయం నాకొక దారిని చూపిస్తుంది. మమకారం అంటేనే పలాయనం, ఈ పారిపోవడమే నిబద్ధీకరణాన్ని యింకా పటిష్టంగా తయారుచేస్తున్నది. నీమీద నేను మమకారం పెంచుకున్నానంటే దానికి కారణం నేను పారిపోవడానికి నీవు ఒక సాధనంగా పనికొస్తున్నావు కాబట్టి. అందువల్ల నీవు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి, నీవు నాకు స్వంతం అవాలి, నిన్ను గట్టిగా పట్టుకొని వుంటాను. నిబద్ధీకరణంలో నీవూ ఒక అంశం; పారిపోవడమే ఆ నిబద్దీకరణం. మన యీ పారిపోవడాలనీ గురించిన ఎరుక మనకు కలిగితే అప్పుడు యీ నిబద్ధీకరణాన్ని తయారుచేస్తున్న కారణాలను, ప్రభావాలను చక్కగా పరిశీలించవచ్చు.
'సమాజ సేవ ద్వారా నానుంచి నేను పారిపోతున్నానా?'
దాని మీద మీకు మమకారం వుందా? అది మిమ్మల్ని బంధిస్తున్నదా? సమాజ సేవ చేయకపోతే మీరు అయోమయంలో పడిపోతారా; అంతా ఖాళీగానూ, విసుగ్గానూ అనిపిస్తుందో మీకు?
'తప్పకుండా అనిపిస్తుంది.' పనిమీద మీరు పెంచుకున్న మమకార బంధమే మీ పలాయనం. మన అస్తిత్వంలోని అన్నీ స్థాయిల్లోనూ యిది జరుగుతుంటుంది.