పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కృష్ణమూర్తి తత్వం


'అందరూ ఏకాంత జీవితాన్నీ, ధ్యానమూ, గాఢ అంతర్విచారణలతో కూడిన జీవితాన్నే గడపాలని మీ సలహానా?'

గాఢమైన ఆలోచనా నిమగ్నత చాలా శ్రమతో కూడుకున్న విషయం. దానిని అవగాహన చేసుకోవడం చాలా కష్టం. తెలిసో, తెలియకుండానేనో ప్రతి ఒక్కరూ తమ తమ పద్దతులకు చెందిన ఒక ఏకాంత జీవితాన్నే కోరుకుంటూ వుంటారు. అయితే ఆ ఏకాంత వాసం మన సమస్యలను పరిష్కరించలేదు. పైగా సమస్యలు యింకా పెరిగిపోతాయి. ఈ నిబద్దీకరణంలోని ఏయే అంశాలు సంఘర్షణలను యింకా ఎక్కువ చేస్తాయి అన్నది అవగాహన చేసుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం. మన సంఘర్షణలని గురించి, బాధలు, సుఖాల గురించి మనకు తెలుసు. అయితే మన నిబద్ధీకరణాన్ని గురించి మనకే తెలియదు. అసలు యీ నిబద్ధీకరణం ఎట్లా జరుగుతుంది?

'సామాజిక ప్రభావాల వల్ల, పరిసరాల ప్రభావాల వల్ల. మనం జన్మించిన సమాజం, మనం పెరిగిన సంస్కృతి, ఆర్థికపరమైన, రాజకీయమైన ఒత్తిడులు మొదలైన వాటివల్ల.'

అది సరే, కానీ మొత్తం అంతా అదేనా? ఇవన్నీ మనం స్వయంగా తయారు చేసుకున్న ప్రభావాలు. అవునా కాదా? మనిషికి తన తోటి మనుష్యులతో వుండే సంబంధ బాంధవ్యాల ఫలితంగా సమాజం ఏర్పడింది. దీనిలో సందేహం లేదు. ఉపయుక్తత, అవసరాలు, సౌకర్యం, సంతృప్తి అనే వాటి మీద యీ బాంధవ్యాలు ఆధారపడి వున్నాయి. ఈ బాంధవ్యాలే మనల్ని కట్టి పడ వేసే ప్రభావాలను, విలువలను తయారుచేస్తున్నాయి. ఈ కట్టిపడేయడమే మన నిబద్దీకరణం. మన ఆలోచనలు, మన చర్యలే మనల్ని బంధిస్తాయి. అయితే మనం యీ విధంగా బంధించబడి వున్నామని మనకే తెలియదు. మనకు తెలసిందల్లా మన బాధలు, సుఖాలు, వాటికి సంబంధించిన సంఘర్షణ, దీనిని మించి పోవడం మన వల్ల కాదు. మనకు చేతనైనది ఏమిటంటే మన సంఘర్షణను యింకాస్త ఎక్కువ చేసుకోవడం. మన నిబద్ధీకరణాన్ని గురించి మనకు తెలియనే తెలియదు. అది తెలుసుకోనంతవరకు సంఘర్షణను, గందరగోళాన్ని యింకా పెంచుకుంటూనే వుంటాం.

'నిబద్దీకరణాన్ని గురించిన ఎరుక మనలో ఎట్లా కలుగుతుంది?'

అది కలగాలంటే మరొక ప్రక్రియని మమకారబంధం అనే ప్రక్రియని అర్థం చేసుకోవాలి. మమకారాన్ని ఎందుకు పెంచుకుంటామో అర్థం చేసుకుంటే, అప్పుడు బహుశ మన నిబద్ధీకరణాన్ని గురించిన ఎరుక మనలో కలుగుతుంది.