రచనలు
143
విధంగా జీవించడానికి, దానిని అందుకోడానికి తగిన సామర్ధ్యం మీకు లేదని భావిస్తున్నారా? ఇది చాలా నిరాశాజనకమైన భావాన్ని కలిగిస్తున్నదా? అపరాధభావాన్ని నిస్పృహను కలిగిస్తున్నదా?
'మీరు చెప్తున్నది నూరుపాళ్ళు నిజం. చాలా సంవత్సరాల క్రితం, నా చిన్నతనంలో మీ ప్రసంగాలు విన్నప్పటినుండీ మీరే నా ఆదర్శం అయ్యారు. ఇట్లా నేను అనవచ్చునో లేదో కాని నాకు మీలాగా వుండాలని వుంది. ఆధ్యాత్మికత మా రక్తంలోనే వున్నది. అందుకని మీలాగా నేను వుండగలను అని గట్టిగా అనిపించింది. అయితే, లోలోపల ఆ దరిదాపులకీ కూడా చేరలేనేమో అనే భయం కూడా వుంటూనే వుంది.'
మనం మెల్లగా వెళదాం. బాహ్యంగా భద్రత లేకపోవడం గురించి మీరు భయపడకపోయినా, అంతర్గతమైన భద్రతా లేమీ గురించి మీరు భయపడుతున్నారు. ఒక్కొక్కరు బాహ్యమైన భద్రత కోసం పరువు ప్రతిష్టల పైనో, కీర్తి పైనా, డబ్బు పైనా యింకా అటువంటివాటి పైనా ఆధారపడతారు. మీరు ఒక ఆదర్శం ద్వారా అంతర్గతమైన భద్రత సాధించాలని కోరుకుంటున్నారు. కాని ఆ ఆదర్శాన్ని అందుకునే శక్తి సామర్థ్యాలు మీలో లేవేమో అని అనుకుంటున్నారు. ఒక ఆదర్శంగా అవాలని, ఒక ఆదర్శాన్ని అందుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? అక్కడ భద్రతా, రక్షణా వుంటాయనీ కదూ? ఈ సురక్షిత స్థానానికి మీరు ఆదర్శం అనే ఒక పేరు పెట్టారు. వాస్తవంగా మీరు కోరుతున్నది క్షేమంగా వుండాలని, సురక్షితంగా వుండాలని. అంతేనా?
'ఇంత సూటిగా మీరు చెప్పాక నాకు తెలుస్తున్నది, ఖచ్చితంగా ఇదే.'
'ఇప్పుడే యీ సంగతి మీరు కని పెట్టారు, అవును కదూ? సరే, యింకా ముందుకు పోదాం. బాహ్యమైన భద్రత వట్టి డొల్ల అన్నది యిప్పుడు మీకు స్పష్టంగా తెలిసింది. అయితే, ఒక ఆదర్శాన్ని చేపట్టడం ద్వారా అంతర్గతమైన భద్రతను పొందాలనుకోవడంలోని మిధ్యను 'మీరు గ్రహిస్తున్నారా? ఇక్కడ డబ్బుకి బదులుగా ఆదర్శాన్ని రక్షణ కోసం మీరు ఆశ్రయిస్తున్నారు. నిజంగానే యిది మీరు చూడగలుగుతున్నారా?
“అవును, నిజంగానే గ్రహించాను.”
ఇక యిప్పుడు మీరు ఏమిటో అట్లాగే వుండండి. ఆదర్శం మిథ్య అని మీరు గ్రహించినప్పుడు, అది దానంతట అదే రాలిపడిపోతుంది. 'ఉన్నది' ఏదో అదే మీరు.