140
కృష్ణమూర్తి తత్వం
'నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. నా కాబోయే భార్యకు అన్నీ సౌకర్యంగా ఏర్పాటు చేయాలి.'
భవిష్యత్తుని గురించి ఆందోళన పడటం ఎందుకు? మీరు యింకా చాలా చిన్న వయసులో వున్నారు. ఉద్యోగం చేసి, భార్యకి కావలసినవన్నీ సమకూర్చవచ్చు. ఎప్పుడూ అదే ధ్యాసలో పడిపోయివుండటం ఎందుకు? సమాజంలో మీకున్న హోదా పోతుందేమోననే భయం మీలో వున్నదా?
'కొంతవరకు అదీ వుంది. మాకు కారు వున్నది, కొంత ఆస్తి, పేరు ప్రఖ్యాతులు వున్నాయి. ఇదంతా పోగొట్టుకోవాలనీ లేకపోవడం సహజమే. బహుశ నా భయానికి అదే కారణమై వుండచ్చు. కానీ పూర్తిగా అదే కాదు. అసలు భయం నా అస్తిత్వం పోతుందేమోనన్నది. భయంతో నాకు మెలకువ వచ్చినప్పుడు, నాకు అంతా అయోమయంగా అనిపిస్తుంది. నేను ఎవరినీ కాను అని అనిపిస్తుంది, ముక్కలు ముక్కలై నేను విరిగిపడిపోతున్నట్లుగా అనిపిస్తుంది.'
ఒకవేళ ఏదయినా కొత్త ప్రభుత్వం వస్తే, మీ ఆస్తి, మీ సంపద అంతా మీరు కోల్పోవచ్చు. కానీ మీరు యింకా చిన్నవయస్సులోనే వున్నారు. ఉద్యోగం చేసి, సంపాదించుకోవచ్చు. లక్షలాదిమంది తమ యిళ్ళూ వాకిళ్లూ పోగొట్టుకుంటున్నారు. మీకూ అది జరుగుతే జరగచ్చు. అంతే కాకుండా, అసలు ప్రపంచంలో వున్న సంపద అందరూ పంచుకోవాలి తప్ప, కొద్దిమంది చేతుల్లో వుండటం సమంజసం కాదు. ఈ వయసులో యింత సనాతనమైన పాతధోరణి ఆలోచనలు ఎందుకున్నాయి మీలో, ఆస్తి పోతుందని అంత భయం ఎందుకు?
'చూడండి, ఒక అమ్మాయిని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి ఏ అవరోధాలు వస్తాయోనని భయపడుతున్నాను. మమ్మల్ని ఏవీ ఆపలేవని నాకు తెలుసు; ఆమెని విడిచి నేను, నేను లేకుండా ఆమె వుండలేక పోతున్నాం. నా భయానికి గల కారణాలలో యిదీ ఒకటేమో.'
మీ భయానికి కారణం అదేనా? మీకు తెలిసినంతలో మీ వివాహానికి అడ్డుతగిలేది ఏదీ లేదని మీరు గట్టిగా చెప్తున్నారు. అట్లాంటప్పుడు యింకా యీ భయం దేనికి?
'నిజమే. మేము ఎప్పుడు కావాలని నిర్ణయించుకుంటే అప్పుడు వివాహం చేసుకోవచ్చు. కాబట్టి నా భయానికి అది కారణం కాకపోవచ్చు. కనీసం ప్రస్తుతానికి. బహుశ నేను భయపడుతున్నది నా అస్తిత్వం లేకుండా పోతుందని అనుకుంటా. నేను అనే వ్యక్తి ఒకరు, నా పేరు యివి లేకుండా పోతాయని',