Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

139

గురించి తాను చెప్పుకున్నాడు. కాస్తయినా సంకోచమూ, దాపరికమూ కనబరచలేదు. అతని సమస్య ఏమిటో స్పష్టంగానే తెలుస్తున్నది, కాని అతనికి అది కనబడటంలేదు. అందువల్ల తడుముకుంటున్నాడు.

'ఉన్నది' ఏమిటో దానిని మనం వినిపించుకోము, కనిపెట్టము. మన వూహలు, మన అభిప్రాయాలు యితరుల మీద రుద్దుతూ వుంటాం. ఇతరులని మన ఆలోచనల చట్రంలో యిరికించాలని ప్రయత్నిస్తుంటాం. 'ఉన్నది'ని కని పెట్టడంకంటే మన ఆలోచనలు, మనం చేసే న్యాయనిర్ణయాలు మనకీ చాలా ముఖ్యం. 'ఉన్నది' చాలా సరళంగా వుంటుంది. క్లిష్టంగా వుండేది మనం. సరళంగా వుండే 'వున్నది'ని సంక్లిష్టపరచి, అందులో పూర్తిగా మునిగిపోతాం. రోజు రోజుకీ మన లోపల ఎక్కువై పోతున్న యీ గందరగోళమూ, అది చేసే గోలా మాత్రమే మనకు వినబడుతూ వుంటాయి. 'ఉన్నది' ని వినాలంటే మనకి స్వేచ్చ వుండాలి. అంటే అర్థం ఏ వ్యాపకాలూ వుండకూడదని కాదు. ఆలోచన కూడా ఒక రకమైన వ్యాపకమే. నిశ్శబ్దంగా వుండటానికి యివేవీ మనకి అడ్డుతగల కూడదు. అట్లా నిశ్శబ్దంగా వున్నప్పుడే వినడం అనేది సాధ్యపడుతుంది. అతను యిట్లా చెప్పాడు. నిద్ర పట్టబోతూ వున్నప్పుడు హఠాత్తుగా ఏ అకారమూ లేని అచ్చమైన భయం అతన్ని లేపి కూర్చోబెడుతుందట. ఆ సమయంలో గది స్వరూపమే తల్లక్రిందులై పోతుంది. గోడలు నేలమట్టంగా వుంటాయట. పైన కప్పు వుండదు. కింద నేల మాయమవుతుంది. అతను భయంతో వణికి పోతుంటాట్ట. దిగచెమటలు పోస్తాయి. చాలా సంవత్సరాలుగా యిట్లా జరుగుతున్నదిట.

దేన్ని గురించి మీరు భయపడుతుంటారు?

'నాకు తెలియదు. కాని ఆ భయంతో నాకు మెలకువ వచ్చినప్పుడు మా అక్కయ్య వద్దకో, మా అమ్మానాన్నల వద్దకో వెళ్తుంటాను. కాసేపు వాళ్ళతో మాట్లాడాక నాలో అలజడి తగ్గిపోతుంది. ఆ తరువాత మళ్ళీ నిద్రపోతాను, వాళ్ళు అర్థంచేసు కుంటారు. అయితే నాకు యిరవై ఏళ్ళు దాటాయి. ఇదంతా చాలా వెర్రితనంగా అనిపిస్తున్నది.' మీరు భవిష్యత్తుని గురించి వ్యాకులపడుతున్నారా?

'ఆఁ, కొంత అదే. మేము బాగా వున్నవాళ్ళమే. అయినా నాకు యీ విషయంలో కొంత ఆందోళన వున్నది'.

ఎందువల్ల?