పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135

రచనలు

ఆలోచించుకోలేదు.' అని అనకండి, అతను యిప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి మీ అసలు పరిస్థితి ఏమిటి అన్నది యిప్పుడే గ్రహిస్తున్నారు, కాదూ? అతని మరణం మిమ్మల్ని కుదిపివేసిందీ, యదార్థమైన మీ మానసిక పరిస్థితినీ, హృదయస్థితినీ మీకు చూపించింది. అటువైపు చూడటం మీకు యిష్టంలేక పోవచ్చు; భయంవల్ల అదంతా నిరాకరించవచ్చు; కాని మీరు మరీ కాస్త పరిశీలనగా చూస్తే, మీ లోపలే వున్న ఒంటరి తనం కారణంగా, మీ లోపల వున్న అంతర్గత పేదరికం కారణంగా మీరు దుఃఖిస్తున్నా రని గ్రహిస్తారు. ఇదంతా మీ మీద మీరే జాలిపడుతూవుండటం వల్ల జరుగుతున్నది.

'మీరు చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు, కాదా చెప్పండి' అన్నారు ఆమె. 'మీరు ఎంతో వూరట కలిగిస్తారని వచ్చాను. కాని మీరు నాకిస్తున్నది ఏమిటి?'

చాలామందికి వుండే భ్రాతుల్లో యిదీ ఒకటి- అంతర్గతమైన వూరట అనేది ఒకటి వుంటుందనీ, ఎవరో ఒకరు అది మీకు యివ్వగలుగుతారని మీరనుకుంటారు. లేదా మీ అంతట మీరే అది సంపాదించాలనుకుంటారు. అటువంటిది అసలు లేనే లేదని చెప్తున్నాను. ఊరట కోసం మీరు వెతుకుతుంటే భ్రాంతిలోనే జీవించక తప్పదు. ఆ భ్రాంతి బ్రద్దలైనప్పుడు బాధపడక తప్పదు. ఎందుకంటే దానితోపాటు ఆ వూరట కూడా మాయమవుతుంది. అందువల్ల దుఃఖాన్ని అవగాహన చేసుకోవడానికి లేదా దుఃఖాన్నీ మించి ఆవలగా పోవడానికి, అంతర్గతంగా అసలు ఏం జరుగుతున్నదో చూడాలి తప్ప, దానికి ముసుగు వేసి దాచకూడదు. ఇదంతా స్పష్టంగా చూపించడం నిర్దాక్షిణ్యత కాదు కదా, ఏమంటారు? ఇందులో చునం సిగ్గుపడవలసినంత అసహ్యకరమైనదేమీ లేదు. ఇదంతా చాలా స్పష్టంగా మీరు గ్రహించినప్పుడు, ఆ క్షణమే అందులో నుండి బయట పడిపోతారు. జీవితంలోని సంఘటనలు మిమ్మల్ని ఏ మాత్రం తాకకుండా, ఒక్క గాటుకాని, ఒక్క మచ్చగాని-మీమీద వదలకుండా, ఎప్పటికీ నవ్యనూతనంగా మీరు వుండిపోతారు. మరణం అన్నది మన అందరికీ అనివార్యమే. దానినుంచి ఎవ్వరమూ తప్పించుకోలేము. దీనిని మించిపోయి తప్పించుకోవాలనే ఆశతో రకరకాల నమ్మకాలని పట్టుకొని వేలాడతాం, రకరకాల తాత్పర్యాలు కనిపెట్టాలని ప్రయత్నిస్తుంటాం, మీరు ఏమయినా చేయండి, అది లేకుండా పోదు. రేపో, త్వరలోనేనో, ఎన్నో ఏళ్ళ తర్వాతో- అది రాక మానదు. జీవితంలోని యీ అతి పెద్ద వాస్తవం మనల్ని తాకకుండా వదలదు.

‘కాని...' అంటూ మొదలు పెట్టారు ఆ మేనమామ. ఆత్మ అనేది ఒకటి వున్నదనీ, అది కలకాలం కొనసాగే శాశ్వత సత్వమనీ నమ్మే సాంప్రదాయికమైన విశ్వాసాలన్నీ బయటకు వచ్చాయి. ఆయన తనకి బాగా పరిచయం వున్న రంగంలోకి ప్రవేశించారు. యుక్తి యుక్తమైన వాదాలతోను, వుదాహరణల వ్యాఖ్యలతోను బాగా నలిగిన రంగం