పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచనలు

127

పొందాలనే సంకల్పం అందులోని సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఆటంకమవు తుంది. ఎందుకంటే సంకల్పం అంటే కోరిక; అది అనుకూల సంకల్పమైనా సరే, ప్రతికూలమైనదైనా సరే. కోరిక వున్నప్పుడు నిర్లిప్తమైన ఎరుక వుండటం కుదరదు. అసలు యీ అణచుకోవడాన్ని తయారుచేసినదే కోరిక లేక కాంక్ష. ఈ కోరిక, దీనినే యిక్కడ సంకల్పం అని అంటున్నా కూడా, తానే సృష్టించినదాని నుంచి మళ్ళీ తనని ఏనాటికీ విముక్తం చేసుకోలేదు. అందుకే నిర్లిప్తమైన, అప్రమత్తమైన ఎరుక ద్వారా సంకల్పంలోని సత్యాన్ని పరికించి చూడాలి. విశ్లేషకుడు తనని తాను దీనినుంచి వేరుగా వుంచుకున్నప్పటికీ, అతడు ఆ విశ్లేషించుతున్న విషయంలోని ఒక భాగమే. అతడు విశ్లేషిస్తున్న విషయమే అతడిని నిబద్ధీకరించింది కాబట్టి, దానినుండి తనని తానే విముక్తం చేసుకోలేడు. అందుకే, యిందులోని సత్యాన్ని కూడా గ్రహించుకోవాలి. సత్యం వల్లనే విడుదల కలుగుతుంది తప్ప సంకల్పం వల్ల, ప్రయత్నం వల్ల కాదు.

(కమెంటరీస్ ఆన్ లివింగ్)

ఆరాటం

అర్థంపర్థంలేని చిన్న చిన్న విషయాలు తనని తెగ ఆరాటంలో ముంచెత్తుతుంటాయని చెప్తున్నారు ఆయన. పైగా యీ విషయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త కొత్త ఆరాటాల్లో పడిపోతుంటారుట. ఏదో ఒక శరీర సంబంధమైన దోషాన్ని వూహించుకొని, దాన్ని గురించి విచారిస్తూ కూర్చుంటారుట. మళ్ళీ కొద్ది గంటల్లోనే ఆయన చింత ఆంతా యింకో సంఘటన మీదో, యింకో ఆలోచన మీదో లగ్నం అవుతుందిట. ఒకదాని తర్వాత ఒకటిగా కలిగే ఆందోళనా భరితమైన ఈ యావలతోనే ఆయన బ్రతుకంతా గడిచిపోతున్నది. ఆయన యింకా యిట్లా చెప్తున్నారు. ఈ ఆరాటాలనుంచి బయటపడే మార్గం కోసం ఎన్నో పుస్తకాలు వెతికారు, స్నేహితులతో తన సమస్యగురించి చర్చిస్తుంటారు, ఒక మనోవైజ్ఞానిక నిపుణుడిని సలహా కూడా అడిగారు. ఎందువల్లనో ఏవీ ఆయనకు వుపశాంతిని యివ్వలేదు. చాలా గంభీరమైన, ఆసక్తికరమైన సమావేశాల్లో పాల్గొన్నా, అవి ముగిసిన వెంటనే మళ్ళీ ఏదో ఒక యావ, ఆ పైన యింకో రంధి బయల్దేరుతాయట. వీటి వెనకాల వున్న కారణం కనిబెడితే అవి ఆగిపోతాయా అని ఆయన ప్రశ్న.

కారణాన్ని కనిపెట్టడం ద్వారా దాని ప్రభావాన్నుంచి విముక్తి లభిస్తుందా? కారణం గురించి తెలుసుకోవడం ఫలితాన్ని నిర్మూలిస్తుందా? యుద్ధాలకు గల