126
కృష్ణమూర్తి తత్వం
చిన్నప్పటి నుండీ బాగా బలంగా నిబద్దీకరణం చెందినవారికి. చాలా శ్రమతో కూడుకున్నదయినా అణచివేసుకోవడం ఒక అలవాటుగా తయారవుతుంది. అవగాహన చేసుకోవడం ఒక అలవాటుగా, ఒక నిత్యకృత్యంగా ఎన్నటికీ అవలేదు. దానికి నిరంతరమైన జాగరూకత, అప్రమత్తత వుండితీరాలి. అవగాహన చేసుకోవడానికి మెత్తని గుణమూ, సున్నితత్వమూ, భావోద్రేక పూరితం కానటువంటి ఆర్ధ్రతా కావాలి. అణచివేత ఏ రకంగా చేసుకున్నా దానికి ఎరుకను పదును పెట్టవలసిన పని వుండదు. ప్రేరణలకు యీ విధంగా ప్రతిస్పందించడం అతి సులువైన, అతి బుద్ధిహీనమైన పద్ధతి. అణచివేసుకోవడం అంటే ఏదో ఒక భావనకో, ఒక పద్ధతికో లొంగిపోయి వుండటం. దీనివల్ల ఒక కృత్రిమమైన భద్రత, మర్యాద లభిస్తాయి. అవగాహన వల్ల విడుదల కలుగుతుంది. అణచుకోవడం సంకుచితంగాను, స్వార్థపూరితంగాను తయారుచేస్తుంది. ఆధిపత్యం అన్నా, భద్రతా లేమి అన్నా, యితరుల అభిప్రాయం అన్నా వుండే భయం సైద్ధాంతిక రూపంలో ఒక ఆశ్రయాన్నీ, భౌతికరూపంలో దాని జంటతో పాటుగా నిర్మిస్తుంది. మనసు అందులో పడిపోతుంది. ఈ ఆశ్రయం ఏ స్థాయిలో నిర్మించుకున్నా సరే, భయాన్ని ఎప్పటికీ వుండేలా పోషిస్తూ వుంటుంది. ఈ భయంవల్ల, ఏదో ఒకదానితో భర్తీ చేసుకోవడం, పవిత్రతను ఆపాదించుకోవడం, క్రమ శిక్షణా బయలుదేరుతాయి. ఇవన్నీ అణచివేతకు రకరకాల మారురూపాలు. ఆణచుకున్నది బయట పడటానికి ఏదో ఒక మార్గం కావాలి. అది శరీర సంబంధమైన రుగ్మత కావచ్చు, సైద్ధాంతిక పరమైన భ్రాంతి కావచ్చు, ఒక్కొక్కరి స్వభావగుణాన్ని బట్టి, వారి వారి వింత విచిత్ర ప్రకృతులను అనుసరించి మూల్యం చెల్లించవలసి వస్తుంది.
'నాకు రుచించనివి వినవలసివచ్చినప్పుడల్లా యీ శ్రవణ యంత్రాన్ని ఆశ్రయిస్తున్నానని నేనే గమనించాను. ఆ విధంగా నా స్వంతదైన మరో లోకంలోకి నేను పారిపోవడానికి అది సహాయపడుతున్నది. అయితే ఏళ్ళ తరబడి జరిగిన అణచివేత నుంచి విముక్తిచెందడం ఎట్లా? దానికి చాలా సమయం పట్టదూ?'
ఆది సమయానికి సంబంధించిన సమస్య కాదు; గతాన్ని తవ్వితోడటమూ కాదు, జాగ్రత్తగా విశ్లేషించడమూ కాదు. అణచుకోవడం అనే సత్యాన్ని గ్రహించడానికి సంబంధించిన సంగతి. అణచుకోవడం అనే ప్రక్రియ ఎడల ఏ విధమైన ఎన్నిక చేసుకోవడమూ లేని నిర్లిప్తమైన ఎరుక కలిగివుంటే, అందులోని సత్యాన్ని వెంటనే గ్రహిస్తాము. నిన్న, రేపు అనే దృష్టితో ఆలోచించడం ద్వారా అణచివేయడం అనే సత్యాన్ని కనిపెట్టలేము. సత్యం కాలగమనంలో ఆకళింపు చేసుకునేది కాదు. సత్యం సాధించి అందుకునేది కాదు. దానిని చూస్తారు లేదా చూడరు. అంతే తప్ప క్రమ క్రమేణా దానిని చూసి గ్రహించడం అనేది లేదు. అణచి వేసుకోవడం నుండి విముక్తి