120
కృష్ణమూర్తి తత్వం
విసుగ్గా వుంటుంది. అమూల్య సంపద ఏ పుస్తకాల్లోనూ లేదు, మీ గురువులోనూ లేదు. అది మీ లోపలే వుంది. మీ మనసును మీరు అవగాహన చేసుకోవడం అన్నదే ఆ అమూల్య ధనాగారాన్ని తెరిచే తాళంచెవి. మీ మనసును మీరు అర్థం చేసుకోవాలి. పతంజలి చెప్పిన ప్రకారంగానూ కాదు; చాలా చాతుర్యంతో విషయాలను వివరించి చెప్పగల ఎవరో ఒక మనోవైజ్ఞానిక నిపుణుడు చెప్పిన ప్రకారంగానూ కాదు. మిమ్మల్ని మీరు మెళకువతో గమనిస్తూ వుండటం ద్వారా, మీ మనస్సు అంటే చేతన మానసమే కాదు, అచేతన మానసంలోని నిగూఢమైన పొరలతో సహా ఎట్లా పనిచేస్తున్నదో పరిశీలించడం ద్వారా అర్థం చేసుకోవాలి. మీ మనస్సును మెళకువతో కనుక గమనిస్తూ వుంటే, దానితో ఆటలాడుతూ వుంటే, అప్రయత్నంగా అభివ్యక్తీకరిస్తూ మనసు స్వేచ్ఛగా వున్నప్పుడు దానిని పరికిస్తుంటే, మాటల్లో చెప్పలేనన్ని అమూల్య సంపదలను అది తెరిచి చూపిస్తుంది. అప్పుడు మీరు యీ పుస్తకాలన్నింటినీ మించి పోతారు. అయితే దీనికి అత్యంతమైన సావధాన శీలత్వం, జీవశక్తి, తీవ్రమైన అభిలాష చాలా ఆవశ్యకం. కాలక్షేపానికి చేసే వ్యాఖ్యానాలతో తృప్తిపడే దంతవేదాంతం కాదు. అందువల్ల మనస్సు తను తెలుసుకున్న జ్ఞానాన్నుంచి విముక్తి పొంది వుండాలి. సంపాదించిన జ్ఞానంతో ఆవరించుకొని పోయి వున్న మనస్సు 'వున్నది' ఏమిటనేది ఏనాటికీ కనుక్కోలేదు.
ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,
బొంబాయి, 25 మార్చి 1956.