118
కృష్ణమూర్తి తత్వం
కష్టతరమైన పని. దీని అర్థం ఏమిటంటే, యిది ఫలానా అని మాటల్లో అనడానికి, పేర్లు పెట్టడానికి స్వస్తి చెప్పాలి, వాటిని పూర్తిగా ఆపివేయాలి. నాలో దురాశ వుంది, స్వంతానికి కూడబెట్టుకునే తత్వం వుంది, కోపంగా వుంటాను, ఆవేశంగా వుంటాను, లేదా మరొకటి అని ఎరిగినప్పుడు, పోటిని ఖండించకుండా కేవలం పరిశీలించడం, ఎరుకగా వుండటం సాధ్యం కాదా? అంటే అర్థం, ఆ మనోభావానికి ఒక పేరు పెట్టడం అనేదే ఆపివేయాలి అని; ఉదాహరణకి, 'దురాశ' అనే ఒక పేరు నేను పెట్టినప్పుడు, ఆ పేరు పెట్టడమే దాన్ని ఖండించే ప్రక్రియ అవుతున్నది. అసలు 'దురాశ' అనే ఆ మాట వినగానే దండనార్హమైనది అని మన నాడీమండలం అంటుంది. ఇటువంటి తీర్పుల నుండి మనస్సును విముక్తం చేయడం అంటే పేర్లు పెట్టడాన్ని అంతం చేయాలి. నిజంగా చూస్తే యీ పేర్లు పెట్టడం ఆలోచిస్తున్నవాడు చేస్తున్న పని. ఆలోచిస్తున్నవాడు తనని ఆలోచననుండి వేరు చేసుకుంటుంటాడు. ఇది పూర్తిగా కృత్రిమమైన పద్దతి, యిందులో నిజం లేదు. ఉన్నది ఆలోచించడం ఒక్కటే. ఆలోచిస్తున్నవాడు వుండడు. ఆనుభవం చెందుతున్న ఒక స్థితి వున్నది తప్ప, అనుభవిస్తున్న ఒక జీవి లేడు. కాబట్టి ఎరుక, పరిశీలన అనే యీ సమస్త ప్రక్రియ అంతా ధ్యానప్రక్రియ. ఇంకో విధంగా చెప్పాలంటే ఆలోచనల రాకపోకలకు నిరభ్యంతరంగా సమ్మతించడం. మనలో చాలామందిలో ఏ పిలుపూ లేకుండానే ఒక దాని తర్వాత యింకొకటిగా ఆలోచనలు వస్తూ వుంటాయి. ఆలోచనలకు ముగింపే వుండదు. అన్ని రకాలైన తిరుగుబోతు ఆలోచనలను రానిచ్చి మనసు వాటికి దాస్యం చేస్తుంటుంది. ఇది మీరు గ్రహిస్తే అప్పుడు ఆలోచనలను మనమే పిలవచ్చు- ఆలోచనలను పిలిచి, వుదయిస్తున్న ఒక్కొక్క ఆలోచన వెనకాలే వెళ్ళడం. మనలో చాలామందికి పిలవకుండానే ఆలోచనలు వస్తాయి. ఎటు నుంచి బడితే అటు నుంచి అవి వస్తుంటాయి. ఈ ప్రక్రియనంతా అర్థం చేసుకొని, ఆలోచనలను ఆహ్వానించి, ఒక్కొక్క ఆలోచననూ కొనదాకా వెంబడించడమే నేను వర్ణించిన ఎరుక అనే మొత్తం ప్రక్రియ. ఇందులో పేర్లు పెట్టడం అన్నది వుండదు. అప్పుడు మనస్సు అద్భుతమైన నెమ్మదిని పొందినట్లు గమనిస్తారు. ఇది అలసట వల్లా కాదు, క్రమశిక్షణ ద్వారానూ కాదు, తనని తాను చిత్రహింస చేసుకోవడం, అదుపు చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా కూడా కాదు. తన కార్యకలాపాలను గురించి తను ఎరుకగా వుండటం వల్ల మనసు పరమాశ్చర్యకరంగా నెమ్మదినీ, నిశ్చలతనూ, సృజనాత్మకతను పొందుతుంది. ఏ క్రమశిక్షణా, ఏ బలవంతమూ అమలు చేయకుండానే యిది జరుగుతుంది.