పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

117

గుర్తించడమూ వుంటాయి. ఇదంతా కేవలం 'నా' యొక్క, 'స్వ' యొక్క, 'నేను' యొక్క ఎరుక- యిందులో నేనుకు సంబంధించిన సంప్రదాయాలు, స్మృతులు మొదలైనవన్నీ మిళితమై వుంటాయి. ఇటువంటి ఎరుక పరిశీలిస్తున్నవాడికి, అతడు పరిశీలిస్తున్న దానికీ మధ్య, నేను ఏమిటి అన్నదానికి నేను ఎట్లా వుండాలి అన్నదానికి మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది. కాబట్టి ఖండించడం, తప్పొప్పులు నిర్ణయించడం, విలువలు కట్టడం అనే ప్రక్రియ లేకుండా ఎరుకగా వుండటం సాధ్యం కాదా? నా వైపుకు నేను వూరికే చూసుకోవడం- నాలో వున్నవి ఎటువంటి ఆలోచనలయినా సరే- ఖండించకుండా, తప్పొప్పులు నిర్ణయించకుండా, విలువలు కట్టకుండా చూసుకోవడం సాధ్యం కాదా? మీరెప్పుడయినా యిది ప్రయత్నించారేమో నాకు తెలియదు. ఇది చాలా కరినాతికరినమైన పని. ఎందుకంటే చిన్నతనం నుండీ మనకు యిచ్చిన శిక్షణ వల్ల మనం ఎప్పుడూ ఖండించడమో, ఆమోదించడమో చేస్తూ వుంటాం. ఈ ఖండన, ఆమోదం అనే ప్రక్రియలో ఆశాభంగం వుంటుంది, భయం వుంటుంది, నమిలివేస్తున్నలాంటి బాధ, ఆందోళన వుంటాయి. ఇదే 'నా' అనే, 'నేను' అనే ప్రక్రియ.

కాబట్టి, యిదంతా తెలుసుకున్నాక, ఒక ప్రయాసగా కాకుండా, ఖండించకూడదు అని ప్రయత్నించకుండా, తప్పొప్పుల నిర్ణయాలు చేయకుండా మనసు ఎరుకగా వుండగలదా? ఎందుకంటే 'నేను ఖండించకూడదు' అని అన్న మరుక్షణమే ఖండన అనే ప్రక్రియలో మనసు చిక్కుకొని పోయివుంటుంది. మనస్సు ఆవేశ రహితంగా గమనించగలదా, ఆ విధంగా తనకు విషయాలతో, మనుష్యులతో, వివిధ భావాలతో వున్న బాంధవ్యం అనే అద్దంలో తన ఆలోచనలను, తన మనోభావాలను పరిశీలించుకోగలదా? అటువంటి మౌనమైన పరిశీలన వలన ఏకాకితత్వము, ఆర్ధ్రత లేని మేధావితత్వమూ అలవడి, పెరిగిపోతాయని అనడానికి వీల్లేదు. అందుకు పూర్తిగా విరుద్ధంగా జరగవచ్చు. నాకు ఒక విషయం గురించి అవగాహన కలిగినప్పుడు యిక ఖండించడం అనేది వుండనే వుండకూడదు; పోల్చి చూడటం కూడా వుండకూడదు ఇది నిజంగా చాలా సులువైన విషయం. కానీ పోల్చిచూడటం ద్వారా అవగాహన జరుగుతుందని మనం అనేకమైన వాటితో రకరకాలుగా పోల్చి చూస్తుంటాం. మన విద్యావిధానంలో అంతా పోల్చి చూడటమే. మన సమస్తమైన నీతి సూత్రాలు, మతవ్యవస్థ అంతా పోల్చి చూడటం, ఖండించడం అనే వాటితో ముడిపడి వున్నాయి.

కాబట్టి, నేను చెప్తున్న ఎరుక ఏమిటి అంటే- ఖండించడం అనే మొత్తం ప్రక్రియ ఎరిగివుండటం, దాన్ని పూర్తిగా అంతం చేసి వేయడం. ఇందులోనే తప్పొప్పుల నిర్ణయం లేకుండా పరిశీలించడమూ వుంటుంది. అయితే యిది చాలా