112
కృష్ణమూర్తి తత్వం
మాత్రమే నాకు తోడ్పడుతాయి. నేను ఏమిటో అవగాహన చేసుకోకుండా దానిలోకి పూర్తిగా వెళ్ళకుండా, అంటే ఒక్క సచేతనమైన పొరల్లోకే కాకుండా, అచేతనంగా వున్న పొరల్లోకి కూడా వెళ్ళకుండా, నేను- నా అనే మొత్తం ప్రక్రియను అవగాహన చేసుకోకుండా, కేవలం శాంతికోసం వెతుక్కోవడంలో ఏమాత్రం ప్రయోజనం లేదు.
చూడండి, మనలో చాలామందికి సోమరితనం అలవాటు, స్తబ్దంగా జీవిస్తుంటాం. మనకి సహాయం చేయడానికి గురువులూ, ఆశ్రమాలూ కావాలి. నిరంతరమైన మన ఎరుక శీలత్వం ద్వారా, మన శోధన ద్వారా, మన స్వంత అనుభవాల ద్వారా, అవి ఎంత స్పష్టంగా ఎంత సూక్ష్మంగా, ఎంత అందీ అందకుండా జారిపోతూ వున్నా సరే, వాటి ద్వారానే, మనంతట మనమే కనిపెట్టాలని అనుకోము. అందుకనే చర్చీలలో, సంఘాలలో చేరతాం. ఏదో ఒకదానిలో చేరి, అనుయాయూలం అవుతాం. అంటే అర్థం, ఒక పక్కన పోరాటమూ వుంటుంది, మరో పక్కన స్తబ్దతను అలవరచుకోవడమూ వుంటుంది. అయితే ఎవరయినా నిజంగా కనుగొనాలని కోరుకుంటుంటే, ప్రత్యక్షంగా అనుభవం పొందాలని కోరుకుంటుంటే- యిటువంటి అనుభవం ఏమిటి అనేది మనం యింకోసారి చర్చించుకుందాం... అప్పుడు యిటువంటివన్నీ పక్కన పెట్టి, అసలు మనల్ని మనమే అవగాహన చేసుకోవడం తప్పనిసరిగా జరగాలి. వివేకానికి స్వీయజ్ఞానమే ఆరంభం. దీని ద్వారా మాత్రమే శాంతిని పొందగలుగుతాం.
ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జై కృష్ణమూర్తి, VI వాల్యూమ్,
ఒహాయి, ఆగష్టు, 1952.
ప్రశ్న: ఆలోచనలు అంతులేకుండా అట్లా ఎప్పటికీ సాగిపోతూ ఉంటాయి కదా, అటువంటప్పుడు వాటిని ఆపడం అసాధ్యమయ్యేదేనా?
కృష్ణమూర్తి: 'నాకు తెలియదు' అని కనుక నేను అంటే అప్పుడు మీరేం చేస్తారు? నిజంగానే నాకు తెలియదు. సర్! ఇక్కడ చెప్తున్న విషయాన్ని శ్రద్దగా వినండి. ఎన్నో రకాలైన ప్రయత్నాలు జరిగాయి. ఆశ్రమాల్లో చేరడం; ఒక బొమ్మతోనో, ఒక సిద్దాంతంతోనో, ఒక వూహాప్రతిపాదనతోనో మనల్ని మనం తాదాత్మ్యం చేసుకోవడం క్రమశిక్షణ ద్వారా, ధ్యానం ద్వారా, నిర్బంధించీ, అణచివేసీ ఆలోచనలను అంతంచేయడానికి ప్రయత్నించడం- మనిషి తనకు సాధ్యమైన పద్ధతులన్నీ ప్రయత్నంచేసి చూశాడు. శత సహస్రాలైన పద్ధతుల్లో తనను తాను చిత్రహింస చేసుకున్నాడు,