110
కృష్ణమూర్తి తత్వం
ప్రశ్న : నాకు తెలిసినంతలో, ఆధ్యాత్మిక విషయాలను బోధించే తక్కిన ఆచార్యులలాగా కాకుండా, అంతర్గతమైన శాంతిని అందుకోవడానికి ధ్యానమార్గాన్ని నిర్దేశించని వారు మీరొక్కరే. అంతర్గతమైన శాంతి అవసరం అని అందరం వొప్పుకుంటాం. కానీ, ఏదో ఒక ప్రత్యేక పద్ధతిని- తూర్పుదేశాల యోగాభ్యాసమో, పాశ్చాత్యుల మనోతత్వ శాస్త్రమే సాధన చేయకుండా దానిని ఎట్లా అందుకో గలుగుతాం?
కృష్ణమూర్తి : ఈ ఆచార్యులు, ఆధ్యాత్మిక గురువులు, శిష్యులూ యిదంతా పరమ దండగ కాదూ? ఒక గురువును ఆశ్రయించి శిష్యరికం మొదలు పెట్టగానే, కనుగొనడానికి, దర్శించుకోవడానికి మీకు తప్పక అవసరమైన, అనుక్షణమూ వెలుగుతూ వుండవలసిన, మీ లోపల వుండే ఆ జ్వాలను హతమార్చుకోవడం లేదూ? సహాయం కోసం అర్థిస్తూ ఒక గురువును ఆశ్రయించినప్పుడు, మీరు అన్వేషిస్తున్న సత్యం కంటే ఆ గురువే ఎక్కువ ముఖ్యడవటం లేదూ? కాబట్టి యీ గురుశిష్యుల పద్ధతినంతా వదిలేసేద్దాం. అసలు యీ పద్ధతిని మన రక్తంలో నుంచే తొలగించేసుకుని, అప్పుడు అసలు సమస్యను పరికిద్దాం. ఎందుకంటే దీని ప్రభావం మనలో ప్రతి వొక్కరి మీదా వున్నది. సత్యం కనుగొనడానికి ఏ గురువూ సహాయం చేయలేడు. అందులో సందేహం లేదు. అది మన లోపలే వుంది. మనమే అది తెలుసుకోవాలి. ఇందుకోసంగాను కష్టాలు పడాలి; బాధ, శోధన తప్పవు. ప్రతివారూ తమంత తామే అన్వేషించుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అంతేతప్ప, ఎవరో ఒక గురువును పట్టుకొని, ఆయన శిష్యరికం చేయడంవల్ల మీరు స్తబ్దతనూ, సోమరితనాన్ని అలవరచుకోవడం లేదూ? మనసు మూసుకొనిపోయి చీకటిగా అవడం లేదూ? అంతేకాకుండా అనేక రకాల వారైన గురువులూ, రకరకాలైన వారి విధానాలు అన్నీ పరస్పర విరుద్ధంగా వుంటాయి; వారిలో వారికి పోటీలు, ప్రచారం చేసుకోవడాలు- ఆ తతంగమంతా మీ అందరికీ తెలుసు.
కాబట్టి, యీ శిష్యబృందాలు, గురువులు అనే యీ పద్ధతి అంతా వట్టి హాస్యాస్పదమూ, అవివేకమూ. అయితే యిందులో వున్న ముఖ్యమైన సంగతి యిదీ: శాంతిని అందుకోవడానికి ఒక ప్రాచ్యపద్ధతిగాని లేదో ఒక పాశ్చాత్య పద్దతి గాని, అసలు ఏదో ఒక పద్ధతి అంటూ వుంటుందా? ఒకవేళ ఏదో ఒక పద్ధతిని సాధన చేయడం ద్వారా శాంతిని అందుకుంటే, మీరు అందుకున్నదానిలో, మీరు శాంతి అని అనుకుంటున్న దానిలో సజీవగుణం వుండదు. అది ప్రాణరహితంగా వుంటుంది. శాంతి అంటే యిట్లా వుండాలి అనే ఒక సూత్రీకరణ మీవద్ద వుంటుంది, దాని వైపుగా