Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

108

వుండమని నిర్బంధించబడటం కాదు. ఇటువంటి నిశ్శబ్దంలో సత్యం వునికిలోకి వస్తుంది. అయితే యీ నిశ్శబ్దం క్రైస్తవ నిశ్శబ్దంకాని, హిందూ నిశ్శబ్దంకానీ, బౌద్ధనిశ్శబ్దం కానీ కాదు. ఈ నిశ్శబ్దం వట్టి నిశ్శబ్దం. దానికి పేరు లేదు. కాబట్టి క్రైస్తవ నిశ్శబ్దం లేదా హిందూ లేదా బౌద్ధనిశ్శబ్దం అనే మార్గం అనుసరిస్తే మాత్రం నిశ్శబ్దాన్ని మీరు ఎప్పటికీ పొందలేరు. అందువల్ల సత్యాన్ని కనుగొనబోయే వ్యక్తి తన నిబద్ధీకరణాన్ని పూర్తిగా వదిలేసుకోవాలి- అది క్రైస్తవ, హిందూ, బౌద్ద మరే యితర సమాజాలకి చెందినదైనా సరే. ధ్యానం ద్వారా, లొంగిపోయి. అనుగుణంగా వుండటం ద్వారా మన నేపధ్యాన్ని యింకా బలపరచుకుంటే, దాని వల్ల మనసు మురిగిపోతుంది. జడంగా తయారవుతుంది. అయితే ఎక్కువమంది కోరుకునేది యిది కాదు అని నేను గట్టిగా చెప్పలేను. ఎందుకంటే ఒక వరవడి ఏర్పరచుకొని, దాని ప్రకారం వెళ్ళిపోవడం ఎంతో సులువైన పని. కాని నేపధ్యం నుండి విముక్తి పొంది స్వేచ్ఛగా వుండాలంటే సంబంధ బాంధవ్యాలలో అనుక్షణం జాగరూకత అత్యంత అవసరం.

ఒక్కసారి నిశ్శబ్దం వునికిలోకి వచ్చిందంటే అప్పుడొక అద్భుతమైన, సృజనశీలక స్థితి కలుగుతుంది - అంటే అర్థం మీరు కవిత్వం రాస్తారని కాదు, చిత్రాలు గీస్తారనీ కాదు. చేయచ్చు, చేయక పోవచ్చు కూడా. ఈ నిశ్శబ్దాన్ని మీరు వెతికి పట్టుకోలేరు, నటించలేరు, అనుకరించలేరు- అసలు అప్పుడది నిశ్శబ్దం అవదు. ఏ మార్గం ద్వారానూ దీన్ని చేరుకోలేరు. 'నేను' తీరుతెన్నులు అవగాహన చేసుకున్నప్పుడే, 'నేను' తన కార్యకలాపాలతో, తన హానికరమైన చేష్టలతో పాటుగా అంతరించి పోయినప్పుడే నిశ్శబ్దం వునికిలోకి వస్తుంది. అంటే, మనసు సృష్టిచేయడం ఆపివేసినప్పుడే సృజనశీలత కలుగుతుంది. కాబట్టి మనసు సరళంగా అవాలి, నెమ్మది చెందాలి, నెమ్మది చెంది తీరాలి. ఇక్కడ 'చెంది తీరాలి' అన్నది తప్పు. మనసు నెమ్మదిగా అయితీరాలి అని అన్నప్పుడు నిర్బంధం చేయడం అన్న అర్థం వస్తుంది. 'నేను' అనే మొత్తం ప్రక్రియ అంతా అంతమై పోయినప్పుడే మనసు నెమ్మదిగా వుంటుంది. 'నేను' తీరుతెన్నులు అన్నీ అవగాహన చేసుకోవడం వల్ల 'నేను' కార్యకలాపాలన్నీ అంతమైపోతాయి. అప్పుడు మాత్రమే నిశ్శబ్దం వునికిలోకి వస్తుంది. ఆ నిశ్శబ్దమే నిజమైన ధ్యానం. ఆ నిశ్శబ్దంలో శాశ్వతమైనది వునికిలోకి వస్తుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, V వాల్యూమ్,

లండన్, 23 అక్టోబర్, 1949.