Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కృష్ణమూర్తి తత్వం

ప్రశ్న : మీ అభిప్రాయంలో నిజమైన ధ్యానం అంటే ఏమిటి?

కృష్ణమూర్తి : ముందుగా, ధ్యానం చేయడంలో గల వుద్దేశ్యం ఏమిటి? అసలు ధ్యానం అంటే మనం అనుకుంటున్నది ఏమిటి? మీరు ధ్యానం చేస్తుంటారేమో నాకు తెలియదు. ఇప్పుడు మనందరం కలిసి ప్రయోగం చేసి చూద్దాం. నిజమైన ధ్యానం అంటే ఏమిటో కని పెడదాం. ఈ విషయంలో నేను వ్యక్తంచేస్తున్న వాటిని వినడంకాకుండా, నిజమైన ధ్యానం అంటే ఏమిటి అన్నది మనందరం కలిసి కనుక్కుందాం. కలిసి అనుభవంలోకి తెచ్చుకుందాం. ధ్యానానికి చాలా ప్రాముఖ్యం వున్నది, వున్నది కదూ? నిజమైన ధ్యానం అంటే ఏమిటో మీకు తెలియకపోతే, స్వీయజ్ఞానం కూడా వుండదు. మీ గురించే మీకు తెలియకపోతే ధ్యానానికి అర్థంలేదు. ఎక్కడో ఒక మూలన కూర్చొని గాని, తోటలోనో, వీధిలోనో అటూ యిటూ పచార్లు చేస్తూ గాని ధ్యానంచేయడానికి ప్రయత్నించడంలో అర్థంలేదు. దానివల్ల ఒక విధమైన ఏకాగ్రత కలుగుతుంది, అంటే కొన్నింటిని బహిష్కరించడం. మీలో కొందరైనా యీ పద్ధతులన్నీ ప్రయత్నించే వుంటారు. అంటే, ఒక ప్రత్యేకమైన విషయం మీద కేంద్రీకరించే ప్రయత్నం చేయడం, మనసును నిర్బంధించడం, నిలకడ లేకుండా కొట్టుకుపోతున్న మనసును ఒకదానిమీద కేంద్రీకరింప జేయడం; అది సాధ్యం కానప్పుడు ప్రార్థనకు పూనుకుంటారు.

కనుక, సరియైన ధ్యానం అంటే ఏమిటి అనేది అవగాహన చేసుకోవాలను కున్నప్పుడు మనం ధ్యానం అని అనుకుంటున్న అసత్యాలను గురించి కూడా తెలుసుకోవాలి. ఏకాగ్రత ధ్యానం కాదనడంలో సందేహం లేదు. ఎందుకంటే మీరు గమనించి చూస్తే, ఒకదానిపై ఏకాగ్రత నిలపడం అనే ప్రక్రియలో తక్కినవాటిని బహిష్కరించడం వుంటుంది. అంటే ధ్యాసను మళ్ళించడం వుంటుంది. ఒకదాని మీద ఏకాగ్రత నిలపాలని మీరు ప్రయత్నిస్తుంటారు, కాని మీ మనసు మరో దాని మీదకు షికారు వెళ్తూంటుంది. మనసు స్థిరంగా ఒకదాని మీద నిలబడటం, అది తిరస్కరించి మనసు ఎటో షికారు చేయడం అన్న రెండింటి మధ్యా సదా సమరం జరుగుతూ వుంటుంది. ఈ విధంగా సంవత్సరాల తరబడి ఏకాగ్రత సాధించడం కోసం, ఏకాగ్రత నేర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ వుంటాం. ఇదే ధ్యానం అనే తప్పుడు అభిప్రాయంలో వుంటాం. ఇక, ప్రార్థన అనే సంగతి వుంది. ప్రార్థన ద్వారా కొన్ని ఫలితాలు పొందడం జరుగుతూ వుంది. లేని పక్షంలో లక్షలాదిమంది ప్రజలు ప్రార్థనలు చేయరు. ప్రార్ధన