పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

కృష్ణమూర్తి తత్వం

దేవుడో యింకా అటువంటిదేదైనా కావచ్చు. ఏదో ఒక వ్యాపకంతో మనసు నిండిపోయి వున్నదనే వాస్తవం చాలా ముఖ్యమైనది. మనసు ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో పడివుండి తీరాలా? అర్ధం చేసుకుంటున్నారా? వ్యాపకంలో పడి వున్న మనసు ఒక కొత్తదానిని దేన్నయినా, తన వ్యాపకాన్ని కాకుండా మరొకదాన్ని చూడగలుగుతుందా? ఏ వ్యాపకంతోనూ లేనప్పుడు మనసుకు ఏమవుతుంది? మీకు యిది అర్థమవుతున్నది కదూ? ఏ వ్యాపకమూ లేకపోతే అప్పుడసలు మనసు అనే ఒకటి వుంటుందా? విజ్ఞాన శాస్త్రజ్ఞుడికి తన సాంకేతిక సమస్యలు, తన యంత్ర సంబంధమైన విషయాలు, గణితమూ వ్యాపకాలుగా వుంటే గృహిణికి వంటయిల్లూ, తన పాపాయీ వ్యాపకాలు. ఏ వ్యాపకమూ లేకుండా వుండిపోతామేమోనని మనకు భయం. సామాజికంగా దీనివల్ల ఏ అనర్థాలు కలుగుతాయో అని భయం. ఏ వ్యాపకమూ లేకుండా వున్నప్పుడు మీరు ఏమిటో అది వున్నది వున్నట్లుగా కనిపెట్టవచ్చు. కాబట్టి వ్యాపకం మీరు ఏమిటో దాని నుండి పారిపోవడానికి తోడ్పడుతున్నది.

అయితే, మనసు నిరంతరంగా వ్యాపకంలో మునిగి వుండాలా? మనసుకు ఏ వ్యాపకమూ లేకుండా వుండటం సాధ్యమేనా? క్షమించండి, సమాధానం మీవద్ద లేని ఒక ప్రశ్నలు వేస్తున్నాను. ఆ సమాధానాన్ని మీరు కని పెట్టాలి; అది మీరు తెలుసు కున్నప్పుడు ఒక అపూర్వమైన అద్భుతం జరగడం చూస్తారు.

మీ మనసు ఏవిధంగా వ్యాపకాలతో నిండిపోయి వుంటుందో మీ అంతట మీరే తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఒక చిత్రకారుడు తన కళ, తన పేరు, తన పెరుగుదల, రంగులు కలుపుకోవడం, తన కీర్తి, తన ఖ్యాతి- వీటి వ్యాపకంతో నిండిపోయి వుంటాడు. పండితుడు తన జ్ఞానం అనే వ్యాపకంతో నిండిపోయి వుంటాడు. స్వీయజ్ఞానం పొందాలని పూనుకున్న మనిషికి తన గురించి తెలుసుకోవడమే వ్యాపకంగా వుంటుంది. ఒక చీమ లాగా ప్రతి చిన్న ఆలోచనను, ప్రతి కదలికను గమనించడానికి ప్రయత్నిస్తుంటాడు. వీరందరు చేసేది ఒకటే, బొత్తిగా ఏ వ్యాపకమూ లేకుండా వున్న మనసు, సంపూర్ణంగా ఖాళీగా వున్న మనసు, ఏ వ్యాపకమూ లేని మనసు మాత్రమే కొత్తదానిని అందుకోగలుగుతుంది. అయితే మనసు వ్యాపకంతో వున్నంతవరకు కొత్తది ఆవిర్భవించలేదు.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

ఒహాయి, 4 ఆగష్టు 1955