పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కృష్ణమూర్తి తత్వం

ఏదో అవాలని, ఏదో సాధించాలని, స్వీయ సాఫల్యసిద్ధి జరగాలని ఆరాట పడుతున్నంత వరకు భంగపాటూ వుంటుంది, భయమూ వుంటుంది, సంఘర్షణా వుంటుంది. కాబట్టి స్వీయ సాఫల్యత అనేది అసలు వుంటుందా? అసలు స్వీయ సాఫల్యం అంటే అర్ధం ఏమిటి? స్వీయ సాఫల్యం అంటే మన అర్ధం ఏమిటంటే స్వలాభం- అంటే 'నా' మరింత పెద్దగా, గొప్పగా, ప్రముఖంగా అవడం. 'నేను' ఒక గవర్నరు అవడమే, పెద్ద వుద్యోగస్తుడిని అవడమో, బ్యేంక్ మేనేజరు అవడమో మొదలైనవి. ఇంకా కొంత లోతుగా దీన్ని పరిశీలిస్తే, స్వార్ధం పనిచేస్తున్నంతవరకు అంటే తను చేసే చర్యల్లో నేను గురించిన స్పృహ వున్నంతవరకు భంగపాటు తప్పదు. ఆ కారణంగా బాధలు కూడా తప్పవు. కాబట్టి మన సమస్య బాధలను తట్టుకోవడం ఎట్లా, సంఘర్షణను తొలగించడం ఎట్లా అని కాదు; ఈ నా యొక్క, తన యొక్క స్వభావగుణాలని అవగాహన చేసుకోవడం. ఇదంతా నేను మరీ జటిలంగా తయారు చేయడం లేదనే ఆశిస్తున్నాను. కేవలం సంఘర్షణను తట్టుకోవడం గురించీ, దుఃఖాన్ని తొలగించడం గురించీ మాత్రమే ప్రయత్నిస్తే దుఃఖాన్ని సృష్టించిన కర్త స్వభావాన్ని మనం అర్ధం చేసుకోలేము.

ఆలోచన తన స్వంత వికాసం కోసమూ, తన స్వంత పరివర్తన కోసమూ, తన స్వీయ అభ్యున్నతి కోసమూ అపేక్షిస్తున్నంతవరకు సంఘర్షణ, వైరుధ్యాలు వుంటూనే వుంటాయి. కాబట్టి, నన్ను నేను అవగాహన చేసుకోనంతవరకు సంఘర్షణ, బాధ తప్పవు అన్న సుస్పష్టమైన వాస్తవానికే మళ్లీ మనం వచ్చి చేరాం. అందువల్ల దుఃఖాన్నీ, సంఘర్షణనూ తట్టుకోవడం ఎట్లా అన్నది తెలుసుకోవడం కంటే తననితాను అవగాహన చేసుకోవడం ముఖ్యం. ఇది యింకా వివరంగా తరువాత తెలుసుకుందాం. అయితే, పూజా పునస్కారాల ద్వారా, వినోద కాలక్షేపాల ద్వారా, నమ్మకాల ద్వారా, యింకో రకరకాలైన వ్యాపకాల ద్వారా బాధల నుంచి పారిపోవడం వలన, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడం అనే అసలు ప్రధాన సమస్య నుంచి మీ ఆలోచనలను యింకా చాలా దూరంగా నెట్టి వేస్తున్నారు, దుఃఖాన్ని అర్థంచేసుకోవాలంటే యీ రకరకాలైన పారిపోవడాలన్నీ ఆగిపోవాలి. అప్పుడే చర్య జరుపుతూ వున్న మిమ్మల్ని మీరు ఎదుర్కో గలుగుతారు. చర్య జరుపుతున్న మిమ్మల్ని అవగాహన చేసుకోవడం లోనే. అంటే అర్ధం మీ సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకోవడంలోనే ఆలోచనలను అన్ని సంఘర్షణలనుండి పూర్తిగా విముక్తం చేసి, ఆనందమైన స్థితిలో, యదార్ధ్యమైన స్థితిలో జీవించగల మార్గం మీకు కనబడుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, V వాల్యూమ్,

న్యూ ఢిల్లీ, 14 నవంబర్ 1948