Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

95

తెలుసుకున్నారా? తెలుసుకొని వుంటే మీరేం చేస్తారు? దాన్నుంచి పారిపోవాలని చూస్తారు; కాదూ? మనలోపల యీ సంఘర్షణ, బాధ వున్నాయనే స్పృహ కలగగానే మేధకు సంబంధించిన వ్యాపకాలలోనో, పనిలోనో, వినోదాలలోనో, సౌఖ్యాల్లోనో మునిగిపోయి, అది మరచిపోవాలని ప్రయత్నిస్తాం. బాధల నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తాం. నాగరీకమైనవైనా సరే, మోటువైనా సరే అన్ని పలాయనాలూ సమానమే, కాదంటారా? అసలు సంఘర్షణ అంటే అర్ధం ఏమిటి? మీలో సంఘర్షణ వున్నదని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? 'నా' అనే స్పృహ మీకు కలిగినప్పుడే సంఘర్షణ బయలుదేరుతుంది. ఈ 'నాకు' హఠాత్తుగా తన గురించిన స్పృహ కలిగినప్పుడు మాత్రమే సంఘర్షణ వున్నదనే ఎరుక వస్తున్నది. అది లేనప్పుడు ఏ మార్పులూ లేని, ఒక కృత్రిమమైన, జడమైన, ఒకటే రకమైన నిత్యకృత్యపు జీవితాన్నే మీరు గడిపి వేస్తుంటారు, అవునా? సంఘర్షణ వున్నప్పుడు మాత్రమే మీ గురించి మీకు చైతన్యం కలుగుతుంది. ఏ వైరుధ్యాలూ లేకుండా, ఆశాభంగాలు లేకుండా అన్నీ సాఫీగా జరిగిపోతున్నంత కాలమూ మీ గురించిన చైతన్యం తల ఎత్తదు. నన్ను బంతిలాగా అటూ యిటూ నెట్టివేయనంతకాలం, నాకు కావలసినది నాకు లభిస్తున్నంత కాలం నాలో సంఘర్షణ వుండదు. నాకు అడ్డు తగలగానే నాగురించి నాకు స్పృహ కలుగుతుంది, క్షోభ పడతాను. ఇంకో రకంగా చెప్పాలంటే, నేనులో తన చర్యలకు ఆశాభంగం ఎదురవుతున్న భావం కలిగినప్పుడు మాత్రమే సంఘర్షణ ఆరంభమవుతుంది. కాబట్టి మనకు కావలసింది ఏమిటి? ఏ ఆశాభంగాలూ ఎదురవకుండా నాకు నిరంతరంగా స్వీయ సాఫల్యత సిద్ధించే చర్యలే జరగాలి. అంటే జీవితంలో మసకి ఏవీ అడ్డు తగలకూడదు. వేరే మాటల్లో చెప్పాలంటే, మన కోరికలు నెరవేరుతూ వుండాలి, కోరికలు నెరవేరనప్పుడు సంఘర్షణ బయలుదేరుతుంది, వైరుధ్యాలు మొదలవుతాయి. కాబట్టి మన సమస్య ఏమిటంటే, సఫలత ఎట్లా సాధించాలి, భంగపాట్లు ఏవీ లేకుండా స్వీయ సాఫల్యం సాధించడం ఎట్లా నాకు నా స్వంతానికి ఆస్తి కావాలి, ఒక మనిషి కావాలి, బిరుదులు కావాలి, యింకా అవీ యివీ. అవి నాకు స్వంతమైతే, యింకా నాకు కావలసినవన్నీ కూడా నాకు లభ్యమవుతూవుంటే నేను సంతోషంగా వుంటాను. అప్పుడు ఏ వైరుధ్యాలూ వుండవు. కాబట్టి మనం ఆశిస్తున్నది స్వీయ సాఫల్యం కోసం, ఆ తృప్తి మనకు లభిస్తున్నంత వరకు ఏ ఘర్షణా వుండదు.

సరే, ప్రశ్న ఏమిటంటే స్వీయ సాఫల్యసిద్ధి అనేది అసలు వున్నదా? అంటే, నేను గొప్పతనాన్ని సాధించగలనా, గొప్పగా అవగలనా, సత్యం ఏది అని గ్రహించగలనా? ఇటువంటి యీ కోరికలో ఒక నిరంతరమైన పోరు జరగడం లేదూ? అంటే