xiv
కృష్ణమూర్తి తత్వం
కృష్ణమూర్తి పుట్టుకకు యిరవై సంవత్సరాలకు పూర్వం, దివ్యజ్ఞాన వుద్యమం అమెరికాలో ఆరంభమైంది. భౌతిక వాదాన్ని, ఆ కాలంలో ప్రచారంలో వున్న శాస్త్రబద్దమైన మానవతా వాదాన్ని గర్హిస్తూ ప్రతిరోధించే ధోరణిలో యీ వుద్యమం బయలుదేరింది. హెలెనో పెట్రోవ్నా బ్లవట్ స్కీ అనే రష్యా దేశస్థురాలు దీనిని స్థాపించింది. ఈవిడ భవిష్యవాణి చదవగలిగిన మర్మజ్ఞురాలు. వానరాలనుండి నరుడు పరిణామం చెందాడనే వాదాన్ని యీవిడ ఘట్టిగా ఖండించింది. పైగా క్రైస్తవులు జీసస్ క్రీస్తు సందేశానికి వక్రభాష్యాలు యిస్తున్నారని కూడా ఆరోపించింది. అతీంద్రియ శక్తులని వుపయోగించడం ద్వారా విజ్ఞాన శాస్త్రం, మతమూ తత్వశాస్త్రాలను సమ్మేళవించి 'ప్రకృతిలో నిగూఢంగా వున్న రహస్యాలను, మనిషిలో అజ్ఞాతంగా దాగివున్న శక్తులను' వెలికి తీస్తాననీ ఆమె విశ్వాసభరితంగా పలికింది.
డార్విన్ సూచించిన పరిణామ సిద్ధాంతాన్ని బ్లవట్ స్కీ తీవ్రంగా నిరసించింది. అయితే పందొమ్మిదో శతాబ్దంలో బాగా ప్రాముఖ్యం సంపాదించిన పరిణామ క్రమంలో పురోగమనం అనే భావన ఆమె ఆలోచనా ధోరణిలో కూడా ప్రతిధ్వనించింది. 'భూతలం' నుండి 'దివ్యలోకాల' స్థాయివైపు పైకి పోయే క్రమానుగత గమనంలో మానవజీవితం ఒక దశ అని ఆమె అభిప్రాయపడింది. వైజ్ఞానిక సత్యం, గతమూ, భవిష్యత్తూ అన్నీ కూడా దివ్యదృష్టి ద్వారా పరీక్షించి దర్శించడం సాధ్యమవుతుందని ఆమె నమ్మింది. ఆమె అనుయాయి మాటల్లో చెప్పాలంటే :
బౌద్ధము, హిందూ మొదలైన అనేక మూలాధారాల నుంచి బ్లవట్ స్కీ పుష్కలంగా గ్రహించి తన వాదాలలో సమీకరించుకున్నది. ఆమె రచనలలో కర్మ, పునర్జన్మ, బంధాలనుండి మోక్షప్రాప్తి వంటివన్నీ కనబడతాయి; విముక్తి మార్గం చూపడానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకులూ వుంటారు. నిజమైన ఆధ్మాత్మిక గురువు ఆమె సిద్దాంతం ప్రకారం యిట్లా వుంటాడు :