పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

కృష్ణమూర్తి తత్వం

కాబట్టి ఆధారపడటం అన్నది వున్నంతవరకు భయం వుండి తీరుతుంది. అది ప్రేమకాదు. దానిని ప్రేమ అని మీరు పిలవవచ్చు; దానికి ఒక చక్కని, శ్రావ్యమైన మాట తొడిగి కప్పి పుచ్చవచ్చు. అయితే వాస్తవంలో దాని అడుగున వున్నది ఖాళీతనం. ఏ చికిత్సా విధానానికీ లొంగని ఒక గాయం అక్కడ వున్నది. దాని ఎడల స్పృహ వున్నప్పుడు, దాని ఎరుక కలిగినప్పుడు, దానిని అవగాహన చేసుకున్నప్పుడు అది అంతమై పోతుంది. వివరణల కోసం మీరు వెతకనప్పుడు మాత్రమే అవగాహన కలుగుతుంది. చూడండి, యీ ప్రశ్న అడిగినవారు ఒక వివరణ అవసరమని కోరుతున్నారు. నేను చెప్పే నాలుగు మాటలు అతనికి కావాలి. మాటలతోనే మనం తృప్తిపడిపోతోం. ఆ కొత్త వివరణను- అందులో అసలు కొత్తదనం అంటూ వుంటేదాన్ని మీరు మళ్ళీ మళ్ళీ పారాయణ చేస్తారు. అయితే సమస్య మాత్రం యింకా అట్లాగే వుంటుంది; కీచులాటలు యింకా సాగుతూనే వుంటాయి.

అయితే యీ ఆధారపడటం అనే ప్రక్రియని- బాహ్యంగా కనబడేవి, అంతర్గతంగా దాగివుండే ఆధారపడటాలని, మనోతత్వ సంబంధమైన వాంఛలను, 'మరింత' ఎక్కువ కావాలనే ఒత్తిడులనూ- వీటన్నింటినీ కనుక అర్ధం చేసుకుంటే, అప్పుడు మాత్రమే 'ప్రేమ' వుండటానికి తప్పక అవకాశం వుంటుంది. ప్రేమ వ్యక్తి నాశ్రయించుకొని వుండదు, నిరాధారంగానూ వుండదు. అది ఒక అస్తిత్వపు స్థితి. అది మనసుకు సంబంధించినది కాదు. మనసు దానిని సంపాదించుకోలేదు. ప్రేమని మీరు అభ్యాసం చేయలేరు. ధ్యానం ద్వారా కూడా దానిని పొందలేరు. భయం లేనప్పుడు, ఆందోళనా భావం, ఒంటరితనం అంతమైపోయినప్పుడు, ఆధార పడటమూ, స్వాధీనం చేసుకోవడమూ లేనప్పుడు ప్రేమ జనిస్తుంది. మనల్ని మనం అవగాహన చేసుకున్నప్పుడే, మన లోపల దాగివున్న వుద్దేశ్యాలను మసం పూర్తిగా గ్రహించుకున్నప్పుడు, మనసు తన లోలోపలి లోతులలోకి ఒక సమాధానమో, ఒక వివరణో వెతకకుండా తొంగి చూసుకో గలిగినప్పుడు, తన లోపలి ప్రతిదానికీ ఒక పేరు తగిలించడం ఆపివేసినప్పుడు అది జనిస్తుంది.

నిజంగా మన దురవస్థల్లో ఒకటి ఏమిటంటే, మనలో చాలామంది జీవితంలోని పై పై కృత్రిమ విషయాలతో- ముఖ్యంగా వివరణలలో- సంతృప్తి పడిపోతారు. వివరణలు యివ్వగానే అన్నీ పరిష్కారం అయిపోయాయని అనుకుంటారు. వివరణలు యివ్వడం మనసు సాగించే ఒక కార్యకలాపం. దేనికైనా సరే, ఒక పేరు తగిలించ గలిగామంటే, ఫలానాదీ ఆనీ గుర్తించగలిగామంటే చాలు. ఎంతో సాధించేశామని అనుకుంటాం. గుర్తించడం, పేరు పెట్టడం, వివరణ యివ్వడం అనేవి ఏవీ లేని