Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

75

ప్రశ్న : మాలో చాలామందికి ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసిన ఒకటే రకం పనులతో విసుగొచ్చేసింది. అయితే యీ పనులు, అంటే ఆ వుద్యోగాలే మా జీవనాధారం. చేస్తున్న పనులతోనే సంతోషంగా జీవించటం మాకు వీలవుతుందా?

కృష్ణమూర్తి : నిజమే, ఆధునిక నాగరికత వ్యక్తిగతంగా మనకి ఏ మాత్రం యిష్టంలేని పనులను మనచేత బలవంతంగా చేయిస్తున్నది. ప్రస్తుతం వున్న సమాజపు నిర్మాణం పోటీలు, నిర్దాక్షిణ్యత యుద్ధం అనే వాటిని ఆధారం చేసుకొని వుంది. దానికి కావలసినది వుదాహరణకి, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులూ అనుకుందాం. ప్రపంచంలో ప్రతి చోటా వీళ్ళ అవసరమే కనబడుతున్నది. ఎందుకంటే యుద్ధపరికరాలని వీళ్ళు యింకా బాగా అభివృద్ధి చేయగలుగుతారు, దయాదాక్షిణ్యాలు లేని యాంత్రికమైన సామర్థ్యాన్ని దేశంలో యింకా పెంపుచేయ గలుగుతారు. కాబట్టి ఒక వ్యక్తిని యింజనీరుగానో, శాస్త్రజ్ఞునిగానో తయారు చేయడానికే విద్యా విధానమంతా నడుంకట్టుకొని కూర్చుంది. అతను వీటికి అర్హుడా కాదా అన్న సంగతి ఎవరికీ అక్కర్లేదు. ఇంజనీరు అవడంకోసం విద్య అభ్యసిస్తున్నవారికి యింజనీరు అవడం అసలు యిష్టమే లేకపోవచ్చు. అతనికి చిత్రకళ మీదో, సంగీతం మీదో, మరోదాని మీద అభిరుచి వుండచ్చు. అయితే పరిస్థితులు- విద్యా విధానం, కుటుంబ సంప్రదాయం, సమాజపు వొత్తిడులు మొదలైనవన్నీ అతన్ని యింజనీరే అయితీరాలని ఆదేశిస్తాయి. ఈ విధంగా ఒకే రకమైన పనులని తయారు చేస్తున్నాం, చాలామంది అందులో చిక్కుకొని పోతున్నారు. ఇక ఆ తరువాత నిస్పృహ,బాధ, అసంతృప్తి వారిని జీవితాంతం వెంటాడుతూ వుంటాయి. ఇది అందరికీ తెలిసినదే.

ముఖ్యంగా యిది విద్యావిధానానికి సంబంధించినది. అవును కదూ? ఒక కొత్తరకమైన విద్యావిధానాన్నీ, అంటే బోధకునికి, విద్యార్థికి యిద్దరికీ కూడా తము చేస్తున్న పని మీద ప్రేమ వుండే విద్యావిధానాన్ని మనం తీసుకురాగలమా? ప్రేమ - ఆ మాటని అచ్చంగా ఆ అర్థంలోనే అంటున్నాను. అయితే, ఎంత సేపూ గెలుపు, అధికారం, పదవి, ప్రతిష్ట సాధించడానికి ఒక సాధనంగా మీ పనిని మీరు వుపయోగించు కుంటుంటే ఆ పని మీద మీకు ప్రేమ వుండదు. ఇప్పుడున్న తీరులో వున్న యీ సమాజం బొత్తిగా విసుగెత్తి పోయిన, ప్రతీరోజూ చేసే పనుల్లో చిక్కుకొని పోయిన వ్యక్తులనే తయారు చేస్తున్నదనడంలో సందేహం లేదు. కాబట్టి, పూర్తిగా భిన్నమైన వాతావరణాన్ని తీసుకొని రావాలంటే, విద్యార్థులు, పిల్లలు తాము చేసేది ప్రేమతో చేయగలిగే వాతావరణంలో పెరగాలంటే, విద్యావిధానంలోను, యితర విషయాల్లోనూ కూడా ఒక బ్రహ్మాండమైన విప్లవం రావలసిన అవసరం వుంది. లేదూ?