74
కృష్ణమూర్తి తత్వం
విభజనలు యింకా యిటువంటివి. జాతీయవాదం వల్ల వచ్చే సమస్యల పరిష్కారం కోసం కొంతమంది కలిసి ఒక బృందంగా ఏర్పడి ఎందుకు ప్రయత్నించరు? ఒక పక్కన మన జాతీయ భావాలను వదలకుండా పట్టుకొని కూర్చుని, అంతర్జాతీయతను సాధించాలని మనం ప్రయత్నిస్తే మళ్ళీ యింకో సమస్యను తయారుచేస్తాం. మనలో చాలామంది చేస్తున్నది యిదే. కాబట్టి నిజంగా చూస్తే ఆదర్శాలే కార్యాచరణను నిరోధిస్తున్నాయని గ్రహించవచ్చు. ఒక రాజకీయ వేత్త, చాలా వున్నతమైన అధికార స్థానంలో వున్న వ్యక్తి, యీ ప్రపంచాన్నంతా ఒక వ్యవస్థ క్రిందకు తెచ్చి, ప్రజలందరికీ తిండి దొరికేటట్లుగా చేయవచ్చని అన్నారు. అప్పుడది ఎందుకు జరగడం లేదు? ఆలోచనల్లో వైరుధ్యాలుండటం వలన, నమ్మకాల వలన, జాతీయ వాదాలున్న కారణంగా జరగడం లేదు. కాబట్టి సిద్ధాంతాలే నిజంగా ప్రజల ఆకలిని తీర్చకుండా నిరోధిస్తున్నాయి. మనలో చాలా మంది భావాలతో ఆటలాడుతుంటారు; తాము చాలా గొప్ప విప్లవకారులమని అనుకుంటారు, క్రియాశీలకం లాంటి మాటలతో మనల్ని మనమే సమ్మోహ పరచుకుంటాం. అసలు ప్రధానమైన సంగతి ఏమిటంటే భావాల నుండి, జాతీయవాదాల నుండి, మతపరమైన అన్ని నమ్మకాలనుండి, విశ్వాసాల నుండి మనల్ని విముక్తి చేసుకోవడం. అప్పుడు, ఒక విధానాన్ని అనుసరించి కానీ, ఒక సిద్ధాంతవాదాన్ని అనుసరించి కాని కాకుండా, అవసరాలకు తగినట్లుగా మనం చర్యలు తీసుకుంటాం, కాబట్టి అటువంటి కార్యాచరణకు అడ్డుతగిలే అవరోధాలను, ప్రతిబంధకాలను ఎత్తి చూపడం కాలాన్ని వ్యర్థం చేయడం ఎంతమాత్రం కాదు, గాలి పోగుచేయడమూ కాదు. మీరు చేస్తున్నది నిస్సందేహంగా అర్ధంలేని పని. మీ భావనలు, మీ నమ్మకాలు, మీ రాజకీయ, ఆర్థిక, మత సంబంధమైన పరమౌషధాలన్నీ వాస్తవంగా ప్రజలను విడదీసి, యుద్ధాలకు దారితీయిస్తున్నాయి, సిద్ధాంతాలనుండి, నమ్మకాలనుండి మనసు విముక్తి పొందినప్పుడే, సవ్యమైన చర్య తీసుకో గలుగుతుంది, దేశ భక్తుడు, జాతీయవాది అయిన వ్యక్తి సహోదరభావం అంటే ఏమిటో ఎప్పటికీ తెలుసుకోలేడు; దాన్ని గురించి అతడు ఎంతయినా మాట్లాడవచ్చు గాక. అంతే కాకుండా అతను ఆర్థిక రంగంలోనూ, యితర రంగాల్లోనూ చేసే పనులు కూడా యుద్ధాన్ని ప్రేరేపించేవిగా వుంటాయి. కాబట్టి సవ్యమైన కార్యాచరణ ద్వారా సమూలమైన, శాశ్వతమైన పరివర్తన రావాలంటే మనసులో అంటే పై పై వుపరితలంలోనే కాదు, మూల మట్టంలోనే సిద్దాంతాలనేవి వుండకూడదు. స్వీయాన్నీ గురించిన ఎరుక ద్వారా, స్వీయాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా మాత్రమే సిద్ధాంతాల నుండి స్వేచ్ఛ పొందడం జరుగుతుంది.
ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VI వాల్యూమ్,
1 జనవరి 1950, కొలంబో