పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

69

గుర్తింపు పొందాలనో, పైలోకంలో ఫలితం రాబట్టాలనో కోరుకుంటుంటే అతనిలో ఆకాంక్షాపరత్వం వున్నట్లే, కాబట్టి మనసు అన్ని మంత్రాలను, పూజలను, నమ్మకాలను, అంధవిశ్వాసాలను, యింకా అటువంటి వాటి నన్నింటినీ త్రోసి అవతల పారవేయడమే కాకుండా, అసూయనుండి కూడా విముక్తి పొందాలి. మనిషి సంపూర్ణమైన స్వేచ్ఛను పొందడమే మతపరమైన విప్లవం. అప్పుడే అతడు జీవితాన్ని పూర్తిగా విభిన్నమైన దృష్టితో సమీపిస్తాడు. ఒక సమస్య తరువాత మరొక సమస్యను సృష్టించుకోవడం ఆపివేస్తాడు.

ఇవన్నీ వట్టి మూటలుగానో, మేధావిత్వంగానే భావిస్తూ మీరు విని వుంటారు. ఎందుకంటే, 'ఆకాంక్ష అనేదే లేకపోతే నేను జీవితంలో ఏం చేయగలుగుతాను? సమాజం నన్ను నాశనం చేసేస్తుంది' అని మీలో మీరు అనుకుంటూ వున్నారు. సమాజం మిమ్మల్ని నాశనం చేస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. సమాజాన్ని అవగాహన చేసుకొని, దానిని నిలబెడుతున్న యీ ఆకాంక్షా పరత్వం, అసూయ, గెలుపు కోసం ప్రయాస పడటం, మతపరమైన మూఢవాదాలు, విశ్వాసాలు, అంధాచారాలు అనే మొత్తం నిర్మాణ స్వరూపాన్ని అంతా తిరస్కరించిన మరుక్షణమే మీరు సమాజంలో నుండి యివతలగా వచ్చేస్తారు. కాబట్టి సమస్య మొత్తాన్ని మళ్ళీ కొత్తదనంతో చూస్తారు. బహుశ అప్పుడు సమస్య అనేదే లేకపోవచ్చు. అసలు మీరు యిదంతా కేవలం మాటల స్థాయిలోనే విన్నారేమో. అప్పుడు మళ్ళీ రేపు అంతా యధాతధంగా పాతపద్ధతిలోనే కొనసాగిస్తారు. గీతనో, బైబిలునో చదువుకుంటారు. మీ గురువు వద్దకో, మతాచార్యుల వద్దకో వెళ్లారు. మళ్ళీ అన్నీ మామూలే. ప్రసంగం అంతా విని మేధాపరంగా, వాచ్యంగా అదంతా మీరు ఆమోదించవచ్చు. అయితే మీ జీవితం దీనికి వ్యతిరేకమైన దిశలో పోతూవుంటుంది. కాబట్టి మీరు మరొక సంఘర్షణను తయారు చేసుకుంటారు. అందువల్ల అనలు మీరు వినకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం మీకున్న సంఘర్షణలు, సమస్యలు చాలవన్నట్లు మరొకటి అదనంగా చేర్చడం ఎందుకు. ఇక్కడ కూర్చుని, చెప్తున్నవన్నీ వినడం చాలా బాగుంటుంది. అయితే దీనితో మీ వాస్తవ జీవితానికి ఏ సంబంధమూ లేనప్పుడు, మీరు చెవులు మూసుకొని వుంచుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే సత్యం విన్నాక, అట్లా జీవించకపోతే, అప్పుడు మీ జీవితం ఘోరమైన గందరగోళంలో పడిపోతుంది. దుఃఖభూయిష్టమూ, చీకాకుల మయమూ అవుతుంది. నిజానికి మీ జీవితం అట్లాగే వుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, X వాల్యూమ్,

న్యూఢిల్లీ అక్టోబర్ 10, 1956