Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కృష్ణమూర్తి తత్వం

'బాంధవ్యం' అంటున్నాం. ఏ కాల్పనిక బింబమూ లేనప్పుడే ప్రేమ వుంటుంది. అంటే అర్ధం ఎడం లేనప్పుడు అన్నమాట. ఇంద్రియ సంబంధమైన స్థలం కాదు; భౌతికమైన స్థలం కాదు; అంతర్గతమైన స్థలం వుండనప్పుడు ఎడం లేనప్పుడు సౌందర్యం వుంటుందే, ఆ విధంగా.

స్వీయాన్ని, అంటే తనని తాను పరిత్యజించడం అన్నది లేనప్పుడే ఎడం వుంటుంది. చూడండి, మీకు అవగాహన అవని విషయాలను గురించి మాట్లాడు తున్నాం. ఇంతకు ముందు ఎప్పుడూ మీరు యిది చేసి చూడలేదు. మీకు, మీ భార్యకూ మధ్యన వున్న, మీకూ ఆ వృక్షానికీ మధ్యన వున్న, మీకూ ఆ నక్షత్రాలకో, ఆ ఆకాశానికో, మబ్బులకో మధ్యన వున్న స్థలాన్ని మీరెప్పుడూ తొలగించలేదు. మీరెప్పుడూ నిజంగా పరికించి చూడలేదు, సౌందర్యం అంటే ఏమిటో మీకు తెలియదు. ఎందుకంటే ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదు కాబట్టి, దాన్ని గురించి మాట్లాడతారు, దానిని గురించి రాస్తారు; కాని అదేమిటో మీకు తెలియనే తెలియదు. కాబట్టి ఆ అనుభూతిని మీరు పొందలేదు. బహు అరుదుగా ఎప్పుడైనా పొందారేమో. స్వీయాన్ని పరిత్యజించడం అనే ఆ సంపూర్ణమైన తన్మయత్వాన్ని. ఎందుకంటే స్వీయం అనే ఆ కేంద్రమే తన చుట్టూ తానే యీ స్థలాన్ని తయారుచేసుకుంటుంది. ఈ స్థలం వున్నంతవరకు ప్రేమ వుండదు, సౌందర్యమూ వుండదు. అందువల్లనే మన జీవితాలు యింత శూన్యంగా, యింత కరడుగట్టుకొని పోయి వున్నాయి.

మీరు రోజూ ఆఫీసుకి వెళ్తారు- ఎందుకో నాకు తెలియదు. “నేను వెళ్ళి తీరాలి, ఎందుకంటే నాకు బాధ్యతలున్నాయి, సంపాదించాలి. నా కుటుంబాన్ని పోషించాలి” అని మీరంటారు. ఏ పనైనా మీరు ఎందుకు చేసి తీరాలో నాకు తెలియదు. మీరు బానిసలు- అంతే. ఒక చెట్టుని చూస్తున్నప్పుడు గాని, ఎదుట కూర్చున్నవారి ముఖంవైపు చూస్తున్నప్పుడు గానీ, మీరు పరిశీలించి చూడనే చూడరు. ఒకవేళ ఆ ముఖంపైపు మీరు పరికించి చూసినా, ఒక కేంద్రం నుంచి చూస్తారు. ఈ కేంద్రం మీకు, ఆ వ్యక్తికి మధ్యన చోటును సృష్టిస్తుంది. ఆ ఎడాన్ని అధిగమించడానికి కొందరు ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. ఆ మత్తు మందులు తీసుకోవడం వల్ల మీ మనసు అసాధారణమైన సున్నితత్వాన్ని పొందుతుంది. ఒక రసాయనిక మార్పు జరుగుతుంది. ఆ తరువాత ఎడం పూర్తిగా మాయమవుతుంది. అయితే నేను అవి తీసుకున్నానని అనుకోకండి. (నవ్వులు). అవన్నీ కృత్రిమమైన పద్ధతులు. కాబట్టి యదార్ధమైనవి కావు. అవన్నీ క్షణికమైన సంతోషాన్నీ, తాత్కాలికమైన