పుట:కాశీమజిలీకథలు -07.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23]

పద్మిని కథ

177

ఒకనాఁడు పద్మిని గురుదత్తునితో మనోహరా! నాకతంబునఁగదా మీకీయిడు ములు వచ్చినవి. ఆగర్భశ్రీమంతులై సమస్త విద్యలం జదివి యుత్తమరూపసంపన్ను లైన మీకు మహారణ్యములోఁ గొండలోయలోఁ గోయలతోఁ గూడికొని గుడిసెలలోఁ గాపురముచేయవలసి వచ్చినది అన్నన్నా ! విధిపరిపాకము ! ఆపాపాత్మునిఁజంపి నేనుఁ గూడ మడసితినేని మీకీకష్టము గలుగునా ? మఱియొక కన్యక౦ బెండ్లియాడి సుఖింతురుగదా అయ్యో ? నామూలమున మీతల్లిదండ్రుల కెడమైతిరి. ఎప్పుడో గొప్పవేడుకతో నత్తవారింటికిఁ బోవలయునని తలంచికొనియుంటి ఏయదృష్టమును పట్టినదికాదు. అడవులలోఁ గాపురము చేయుమని మనకు విధి విధించెను. కాఁబోలు. ఆనీచుఁడు నాకు సందేశము పంపినతోడనే మీకుఁజెప్పి యుశీనరపురంబున కఱిగిన నీయాపదరాక పోవునుగదా ? అని మకని తొడపై శిరంబిడుకొని దుఃఖించుటయు గురుదత్తుం డిట్లనియె.

సాధ్వీ ! సాధ్వీతిలకమగు నీతో నిందు వసియింప నాకేమియుఁ గష్టములేదు. ఈయరణ్యమే యుద్యానవనమైనది. ఈ కొండలు క్రీడాశైలములుగా నున్నవి. కాని నీవు గర్భభరాలసవై పనులు గావింపుచుండఁ జూచి పరితపించుచున్న వాఁడ ఇంటి కడనున్న నిన్నుఁ దలిదండ్రులు నత్తమామలు నరచేతిలోఁ బెట్టుకొని కాపాడక పోవు దురా ? ఎందరుబంధువు లెంతేసి నూడిదలు పంపుదురో ? ఏ ముచ్చటయును లేక కిరాతయువతులతోఁగలసి తిరుగుచుండ నిన్నుఁజూచి నా హృదయము భేదిల్లచు న్నది. కానిమ్ము కాల మొక్కరీతి నుండునా ? వినుము.


శ్లో. సుఖస్య దుఃఖస్య నకోపిదాతా
    పరోదదాతీతి కుబుద్ధిరేషా
    అహం కరోమీతి వృధాభిమానః
    స్వకర్మసూత్ర గ్రధితోహి జంతుః

తొల్లి హరిశ్చంద్రాది నృపతులు పడిన బన్నములువిని కథలను కొంటిమిగాని యథార్థములు. కర్మసూత్రమును మీరినవారు లేరు. ఇంద్రాది దేవతలకు దప్పినది కాదు. దైవమెట్లువంచిన నట్లు జేయఁదగిన వార మంతకన్న మనకేమియు స్వతం త్రము లేదని యోదార్చెను.

ఒకరికష్టమునుగురించి యొకరు పరితపించుచు నొండొరుల నోదార్చు కొనుచుఁ బూర్వచరిత్రలను నుగ్గడించుచు నందున్నకోయబాలురకుఁ జదువుజెప్పుచు వినోదముగాఁ గాలక్షేపముచేయుచుండిరి. మరియు పద్మినికి నల్లికపనియందు మంచి నేర్పరితనము గలిగియుండుటం బట్టి యక్కిరాతులల్లెడి చాపలు, బుట్టలునుజూచి