పుట:కాశీమజిలీకథలు -07.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కాశీమజిలీకథలు - సప్తమభాగము

125 వ మజిలీ

పద్మిని కథ

రామదుర్గమున కుత్తరమున కొన్ని యోజనముల దూరములో దుర్గమారణ్య మధ్యంబునఁ గొన్ని కోయపల్లెలు గలవు. ఆపట్టణములకుఁ జుట్టును బెట్టనికోటలై యున్నతములైన పర్వతములు పెక్కువలయముగా వెలయుచున్నవి. ఆపల్లెలకుఁ బదియోజనముల దూరము వరకు మహారణ్యమేకాని గ్రామమేదియును లేదు. అందున్నవారిని శబరులనియు, వనచరులనియు, బోయెలనియుఁ గోయలనియుఁ బిలుచుచుందురు. వాండ్రకు నాగరిక మించుకయుఁ దెలియదుకాని అడవి యాకు లతోఁ జాపలు, బుట్టలు, తట్టలు లోనగు నుపకరణము లల్లుటయందు నేరుపు గలిగి యున్నది.

తేనె, పునుఁగు, జవ్వాది, కస్తూరిలోనగు నడవివస్తువులును దామల్లిన బుట్ట లును గాడిదలపై నెక్కించి గ్రామములయందమ్మి సొమ్ము తీసికొని పోవుచుందురు. అమ్మహారణ్యంబునకుఁ దరుచు జానపదులుగాని, పౌరులుగాని యెన్నఁడు పోవరు.. కోయవాండ్రుతప్ప నప్పల్లెలందున్నవని యెవ్వరును యెఱిఁగినవారులేరు.

మృగములబాధ తలంపక కంటకములవెత లెక్కింవక రాళ్ళకస్తి గణియిం పక రాజద్రోహాపరాధభయంబున గురుదత్తుఁడు భార్యయు నహోరాత్రంబు లేకరీతిఁ బయనము సాగించి మారువేషములతో యెట్లో కొన్నిదినముల కాకోయపల్లె జేరిరి.

దారిలో నొక శబరునితో బరిచయముజేసి యాపల్లెవృత్తాంతముఁ దెలిసికొని వానివెంట నాదంపతులా కొట్టిక కరిగిరి. లేనిచో నత్తెరవెరుంగుట దుర్ఘటమే ఆకొండ పల్లెకు నాలుగు దండలను పెనుకొండలు కోటలవలె నొప్పుచున్నవి. ఆనడుమనున్న సమభూమి మనోహర నానాఫలతరులతావృత్తమై తృణకాష్టజలసమృద్దిఁగలిగి యుద్యా నవనమువోలె గ్రాలుచుండెను. కొండలనుండి ప్రవహించు సెలయేరులకుఁ గాలు వలుగట్టి కోయలు తరులతాగుల్మాదులఁ బెంచుచు సస్యములఁ బండించుచుందురు.

ఒకశబరుని వెంట నీదంపతులా కొండపల్లెకుఁ బోయి యందలి వింతల కచ్చెరువందుచు నందుండుటకు నిశ్చయించికొనిరి. వారిభాష స్వభాషయేయైనను వికృతముగా నుండుటచేఁ దెలిసికొనుట దుర్ఘటముగా నుండెను. మొదట. వారింజూచి యాపల్లెలోని వారందరు నాశ్చర్యపడఁజొచ్చిరి. గురుదత్తుఁడు మాటలుగలుపుకొని కొంతసొమ్మిచ్చి వేరుగ నొక పర్ణకుటీరమువైపించుకొని యందు నివసించి కాలక్షేపము చేయుచుండెను.