పుట:కాశీమజిలీకథలు -07.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోమిని కథ

175

బలత్కారంబున సమసిరో తెలియదు. మీ శాస్త్రపాఠమువలనఁ గలిగిన ఫలమిది పద్మినీ జాతి కన్యం బెండ్లియాడినందులకు నీరీతిఁ బరిణమించినది. తిరుగా నాకన్నులం బడ లేదు. ఇప్పుడేమిచేయుదు? ఈధనమంతయు నెవ్వరి వశము చేయదుము. నీసహవా సంబుచే మాకీ ముప్పువాటిల్లి నదని విలపింపఁ దొడంగెను.

అప్పుడు గదాధరుఁడు పెద్దగ దుఃఖించుచు రత్నాకరా! నీకోడలు మూడులోక ములు మెచ్చుపని చేసినది. అందులకు వగవఁబని లేదు. నలదమయంతులవలె వారు ప్రచ్ఛన్నముగా గొంతకాలము సంచరించి తిరుగా వైభవము లనుభవింపకమానరు ధర్మకవచభూషితులకు నాపదలంటవు. నీవు బెండ్లి యాడి శీఘ్రము రావలయుఁజుమీ? ఆలసించితివేని మేము నిలువలేమని చెప్పిన మిత్రుని వెంటనే చూచు భాగ్యము నాకు లేకపోయినది.

శెట్టీ ! నీకోడలు గుణంబులు బుద్దివిశేషములు పొగడ శేషుఁడు చాలఁడుగదా? ఆమహాపతివ్రతను చెరపఁదలచిన నీచుఁడు సమయక నిలుచునా? మీరు విచారింప వలదు. నేను దేశములు తిరిగి వారిని వెదకి తీసికొనివచ్చెదను. కొంతకాలము గతిం చిన నీయపరాధము మాసిపొవఁగలదు. వారికేమియు భయములేదని బోధించి మంచి ముహూర్తమున నిల్లువెడలి రామదుర్గనగరమునకుఁ బోయెను.

అప్పురంబునబద్మినిం బొగడుచు సురూపునినిందింపని వారులేరు. రాజభటు లకుఁ తొలఁగుచు రూపము మార్చికొని కుముదాంగదుని యింటికింబోయి గదాధరుఁడు తన్నెఱింగించుటయు నావైశ్యద౦పతులువానిం గౌఁగలించుకొని బిట్టువాపోవఁ దొడం గిరి. గదాధరుఁడు తదీయశయనాసన బజనాదులఁ జూచి పరితపించుచు నలుమూ లలు వెదకినంత నొక పుస్తకములో గురుదత్తునిచేఁ వ్రాయఁబడిన యీపద్యము గనఁ బడినది.


క. నలుఁడును రాముఁడు పాండవు
   లిల విధి గతి వెతలఁ బడయరే? మనమును వా
   రలకన్న ఘనులమే? యిది
   దెలిసిన వగమాని ముక్తి తెరవెఱుఁగ వొకో.

అను పద్యము జదివికొని గదాధరుఁ డించుక యాలోచించి మే మడవిలో దాగి యుండెదము తెఱవు తెలిసికొని నీవురమ్మని యభిప్రాయముతో వ్రాయఁబడినది. కావున నేనరణ్యవిశేషములే వెదకఁదగినవని యాలోచించి ఆవైశ్యదంపతులతోఁ జెప్పి యుత్తరాభిముఖుండై అరిగెను.

అని యెఱింగించి,