పుట:కాశీమజిలీకథలు -04.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

    అయ్యలరాజ వం • శాబ్దిసోముఁడు రామ
                 భద్రుఁడు కవితాస • ముద్రుఁడితఁడు
    మల్లనకవి రాజ • తల్ల జుండతఁడు ధూ
                ర్జటిపాదరతుఁడు ధూ • ర్జటియతండు

గీ. సకలరాజాధిరాజ సం • స్థానకలిత
    భూరితకీర్తి పింగళ • సూరియాతఁ
    డాశుకవితాధురంధరం • డతఁడు రామ
    రాజభూషణ కవిరాజ • రాజమౌళి.

అని యెఱింగించుటయు నవ్వుచు వసుంధరుఁడు ఓహో ? వీరా తెలిసినది తెలిసినది. వీరినే కాదా గజములని పిలుచుచుందురు. వీరి చరిత్రము లింతకుముందే మదీయ శ్రోత్రానందము గావించినవి. నరేంద్రా వీరితోఁ బ్రసంగించుటకేనా విష్ణుగుప్తున కంతతీక్షఱముగాఁ బత్రిక వ్రాసితివి ? భళిరేయని యెకసక్కెము లాడిన నారాజు వాని మాటలకు వెఱఁగుపడుచు నీవుగొండికవుగావున నిట్లనుచున్నావు. తత్పాండిత్య మెఱింగి పలుకుమనుటయు దేవగుప్తు డిట్లనియె.

అయ్యా ! నే నెఱుంగఁబట్టియే యిట్ల నుచున్నాను. వీరు మందారవల్లి యను మహా విద్వాంసురాలితోఁ బ్రసంగించిన విషయము తెఱింగినచో వీరికి మీరింత జడియక పోవుదురు గదా. తత్సంవాదమే వీరి ప్రజ్ఞాప్రభావంబులువెల్లడి చేయుచున్నవని పలుకుటయు భట్టుమూర్తి జనాంతికముగా నోహో ! యా రహస్యము వీని కెట్లు తెలిసినదో గదా ? వీని మాటలు మిగుల ప్రగల్భముగా నున్నవి. సింహపోతంబునుం జూచిన కలభంబుచాడ్పున నా హృదయము వీనిం జూచి వెఱచుచున్న దేమియోయని పలుకుటయు రామలింగకవి మాటకుఁ బదియుక్తులుతోచెడు నాకు సైతము వీనికిఁ బ్రత్యుత్తరము చెప్పుట కేమియుం దోచుకున్నది వీఁడు మనకు వాగ్బంధముజేసెనా యేమి యని పలికెను. తక్కినవారును పిరికి తనముగా మాట్లాడికొనిరి.

అప్పుడారాజు సూరిసత్తమా ! యుత్తములు తమ ప్రజ్ఞను క్రియా రూపముగాఁ జూపెదరు. మాటలతో బనియేమి. వాదమునకుఁబూనికొమ్మని పలికిన నతం డయ్యా ! కత్తులతోనా కఱ్ఱలతోనా వీరితో వేనిలోఁ బోట్లాడుదు నని యడిగిన నారాజు నవ్వుచు శాస్త్రములతో బోట్లాడమని పలికెను.

వీరాంధ్ర కవీంద్రులు శాస్త్రములన్నియు సంస్కృతభాషలో నున్నవి. అది వా రెఱుంగుదురో యెఱుంగరో యని సంశయించు చున్నానని పలికిన నలుకతోఁ బెద్దన్న కవిలేచి యమేమీ ? బాలకా ప్రగల్భములు పెక్కు భాషించుచున్నావు ? ఈ రామలింగకవి మందారవల్లింబరాజితం గావించిన వృత్తాంతము నీ వెఱింగిన నిట్లనవు. మాకు సంస్కృతమేరానియట్లు వాక్కాణింపుచున్నావు. ఏ శాస్త్రములోఁ బ్రసంగింతువో