పుట:కాశీమజిలీకథలు -04.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవగుప్తుని కథ

311

మెంత ? బుద్దియెంత ? విద్యయెంత ? యని యూరక స్తోత్రములు చేయుచుండ విని వారితో హరిశర్మయను బ్రాహ్మణుం డిట్ల నియె.

విప్రులారా ! మీరీ బాలుండు కౌముదినిఁ జతురంగములో గెలిచినందులకే యాశ్చర్యపడుచున్నారు. వీనికంటె రెండు మూడేడులు పెద్దగా నుండును. పాండ్య మహారాజు గారి యాస్థాన పండితుఁడు విష్ణు గుప్తునికొడుకు దేవగుప్తుండను బాలు డీ నడుమ కృష్ణదేవరాయలవారి పండితులతోఁ ప్రసంగించెను. వాని విద్యాపాటవము వినిన నెంత యక్కజమందెదరో గదా ! తద్వృత్తాంతము జెప్పెద నాలింపుఁడు.

దేవగుప్తునికథ

పాండ్యదేశ ప్రభు డగు మలయధ్వజుండు పండిత ప్రియుండని వాడుక యున్నది కదా ! ఈ నడుమ రాయలవారి యాస్థాన కవులు పెద్దన్న రామలింగకవి లోనగు పండితులు దిగ్విజయము చేయుచుఁ దద్రాజధానియగు మధురాపురమున కరుదెంచి యన్నరపతితోఁ బ్రసంగ సంగరార్ధులమై యరుదెంచితిమని చెప్పిరి. అప్పు డప్పార్ధివోత్తముండు మిగుల సంతసించుచు విష్ణుగుప్తుండను తన యాస్థానవిద్వాసునకవ్వార్తఁ దెలియజేసెను. ఆ సూరిసత్తముండు తానా సభకు రాక పదియాఁరేడుల ప్రాయముగల తన కుమారుని దేవగుప్తుఁడను మాణవకుని బంపెను. వాని రూపరేఖా పలాసములు కంతునకు జయంతునకుం గూడ లేవని చెప్పఁగలను. పల్ల కీ యెక్కి వచ్చిన యా విప్రకుమారునిం జూచి సభ్యులెల్లరు విస్మయరసావేశమతులై పొగడదొడంగరి. ఆ దివ్యచ్ఛిధామణి యంతకు పూర్వ మెన్నఁడు నిల్లుకదలి రాలేదఁట. అదియే ప్రధమసమాగమనమట దుర్నిరీక్ష్యమగు తదీయ తేజమునకు వెఱగుఁ జెందుచు నా భూపతి యడుగ నతండు తన కథ జెప్పెను. అప్పుడతండు ప్రతివాదిగా నిరూపింపఁబడి యా పండితుల కభిముఖముగా నున్న పీఠంబుపైఁ గూర్చుండెను. అంతలోగంట మ్రోగినది ఆ గురుతు గ్రహించి దేవగుప్తుండు లేచి సభ్యులకు నమస్కరించుచు, దొలుత విద్యాప్రవృత్తిని గుఱించి కొంచె ముపన్యసించెను. ఆ యుపన్యాసము విని సభాసదులు మంత్రింపబడినట్లు కదలక యట్టె వినుచుండిరి. తరువాత నతండువాదుల యభిఖ్యలెట్టివో తెలిసికొనవలయునని యడిగిన వారి శిష్యుఁ డొకండు లేచి యీ పద్యమును జదివెను.

సీ. రామలింగకవీంద్ర • రాజరత్నమితండి
                కలడాంధ్రకవియ పి • తామహుండు
    పెద్దనామాత్యుండు • ముద్దుపల్కుల ముక్కు
                తిమ్మనకవి యీసు • ధీవరుండు