పుట:కాశీమజిలీకథలు -04.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావంతుని కథ

309

కావున నా ముద్దియలిద్దరు కళావంతు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి చతురంగ కేళీశాలలోఁ గూర్చుండఁబెట్టిరి. అంతలో నా రాజనందన సకలాభరణభూషితయై సఖీ పరివృతయై యరుదెంచుచు నల్లంతదవ్వున నక్కాళావంతుంగాంచి తదీయరూప రేఖా విలాసములకు వెఱగుపడుచు నోహో ! పరమేష్టి సృష్టీ వైచిత్ర్యమున కియత్తలేదు కదా ! ఇట్టి సౌందర్యశాలిని బేదపాఱునికిఁ బుట్టించిన యొక్కటియే యతని లోపమై యున్నది. అయ్యో ? వీఁడు నాతోఁ జదరంగమాడి జయింపఁగలడా ? వీనింజూడ నా యెడద జాలిబొడము చున్నది. కారణమేమియో తెలియదు. వీని నెట్లు జంపింతునని యాలోచించి నొకచీఁటి వ్రాసి చెలికి త్తియచే నతనియొద్ద కనిపినది.

“మాణవకోత్తమా ! నీ రూపము దర్శనీయమై యున్నది. నీవు నాతోఁ జదరంగమాడి జయించుటకల్ల. మదీయ శపధంబు కడుదారుణమైనది. ఇప్పుడైనఁ బ్రతుకఁగలవు. లెస్సగా నాలోచించుకొనుము." అని యున్న యా పత్రికందీసికొని పోయి యొకబోటి వాని కిచ్చినది.

దానిం జదివికొని యతండు మఱియొక పత్రిక నిట్లువ్రాసెను. “తరుణీ ! దాక్షిణ్యము జన్మముతోడనే గలుగవలసినది. నీ హృదయంబునం కనికరమేమియు లేనట్లు స్పష్టమగుచున్నది. కానిచో నట్టి వ్రత మేల పట్టెదవు ? నిపుణమతి కిదియా తెరువు ? చాలు చాలు. నన్ను జూచి జాలిపడనక్కరలేదు. నీవు గెలిచిన పిమ్మటఁ గరుణించి విడుతువుగానిలే. నీ యాటలు మూడునుఁ వరుసగఁ ద్రోసిరాజు చేయక పోతినేని నన్ను గెలిచినవానిఁగా దలంపుము." అని వ్రాసి దానిదిరుగ రాజపుత్రిక నొద్దకుఁ బంపెను. ఆ బోటి యా చీటిం జూచికొని వాని ధైర్యమునకు వెఱగందుచు నల్లనబోయి వానికభిముఖముగా నమరింపఁబడిన రత్నపీఠంబున గూర్చుండెను. అంతలో సుఖురాండ్రు నీ లోపల పద్మరాగ మణీశకలములచేఁ గూర్పంబడిన కేళీ ఫలకము వారి నడుమ నిడియందు సితాసితమణి విరచితమైన బలము సవరించిరి.

మఱియుఁ జుట్టునుం గూర్చుండి సఖురాండ్రు వారియాటల జూచుచుండిరి. అప్పుడు మొదట రాజపుత్రికయే మూడెత్తులు జరిపినది. పిమ్మట నా భూసురుండు క్రొత్తమాదిరిగా నెత్తులు వైచెను. వాని జూచి యా చిన్నది యాలోచింపుచుండ నతండహో ? యింత యాలస్యము చేసిననెట్లు? ఇదియా నీ విన్నాణము ? ఇంత సేపాలోచించి వైచిన యెత్తిదియా ? యిందీయపభ్రంశమున్నది చూచితిరా ? యీ మాత్రము పాటవమునకే యింతపన్నిదము వైచితివి ? యేమో యనుకుంటిని చాలు చాలు. అదిగో మంత్రి వచ్చుచున్నాఁడు. చూచుకొనుము కావలసిన నీ యెత్తిచ్చెద దీసికొనుము అని హేళనగా మాటాడుచు నాడియాడి చేడియా ! పాప మెర యని యెరుగక మా బంటునే నా మంత్రిం జంపితివి గదా ఇదిగో చూచుకొనుము మొదట గురుతు పెట్టిన బంటుచే ద్రోసిరాజనిన నీయాటఁ గట్టినది. అని పలుకుచు దొలి యాట యవలీలగా గట్టెను.