పుట:కాశీమజిలీకథలు -04.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

గెలిచెనేని బదివేలమాడలు రాఁగలవు. ఎట్లైనను లాభమేగదా ! పాపమీచిన్నది యోడిపోయినఁ జంపబడుదునను మాట గ్రహింపలేదునుఁబోలు. నేనది తెల్లముచేయనేమిటికని తలంచుచు నమ్మించుబోఁడి కిట్లనియె.

అమ్మా ! దీనికి మనమిప్పుడొక యుపాయము చేయవలయును. నీకుఁ బురుషవేషమువైచి నాకుమారుండని జెప్పెదను. నీవు రాజపుత్రికతోఁ చదరంగమాడి గెలిచితివేని నీ మూలమున నాకును గీర్తిరాగలదు. ఈపాటి యుపకారము జేయఁదగుదువని నుడివిన నప్పఁడతియు నందులకు సమ్మతించినది.

కళావంతుని కథ

అప్పుడు గుప్తముఁ గళావతికిఁ బురుషవేషమువైచి యాపాఱుండు తదీయ రూపవిశేషమున కచ్చెరువందుచుఁ గళావంతుఁడ పేరుతోఁ బిలువఁ దొడంగెను.

అప్పుడు కళావతి పదమూ డేడుఁల ప్రాయముగల చక్కని బ్రహ్మచారివలెఁ బ్రకాశింపుచుండెను.

సదాచారి యక్కుమారుందీసుకొని మఱుఁనాడు ప్రాతఃకాలమున రాజసభకుఁబోయి యందున్న యధికారులతోఁ తనకుమారుండు గౌముదితో జదరంగ మాడుటకైవచ్చెనని చెప్పెను. ఆ యుద్యోగస్థులు కళావంతుని సౌందర్యాతిశయమున కచ్చెరువందుచు సదాచారితోఁ బాపఁడా ! నీవు ధనమున కాసపడి మన్మధునివంటి కుమారునేల జంపుకొనియెదవు? కొమ్ములు తిరిగినవారు వచ్చి యాడలేక యోడిపోయి యురితీయఁబడిరి. వీఁ డెంతవాడు. పాప మాపాపనికింకను ముక్కుపచ్చలారలేదే ? ఎందయిన ముష్టియెత్తుకొని బ్రతుకఁగలఁడని బలుదెఱంగుల బోధించిరి. కాని సదాచారి వారి మాటలఁ బాటింపక యాటకు సెలవిమ్మని ముమ్మాటికిం గోరుకొనెను.

అప్పు డా యధికారు లా సదాచారిచే నోడిపోయినచో నురితీయుటకు సమ్మతించినట్లొడంబడిక వ్రాసి పుచ్చుకొని యా వృత్తాంతము రాజపుత్రికకుఁ దెలియ జేసిరి. రెండు గడియలలో నేటిఁకి మూడవనాఁడు మధ్యాహ మా విప్రకుమారుని మా యంతఃపురంబునకుఁబంపుఁడని కౌముది యొద్దనుండి యాజ్ఞాపత్రిక వచ్చినది.

ఆ పత్రిక జూచుకొని వారు పాఱుఁడా ! నీ కుమారుని కింక మూడు దినములు యాయువు గలిగియున్నది. అప్పుడు తీసికొని రమ్ము పొమ్మని చెప్పుటయు నతండు కళావంతునితోఁగూడ సత్రమున కరుదెంచెను. కళావంతుని జూచిన వారెల్ల జాలిపడుచు బాలుఁడా ! మీ తండ్రి సొమ్ము కాసపడి నిన్ను జంపుకొనుచున్నాఁడు. నీ వందుల కొప్పుకొనబోకుమని కళావంతునికి బోధించుచుండిరి. నవ్వుచు నతండు వారిమాటలఁ బాటింపఁడయ్యెను.

అంత మూడవనాఁడు సదాచారి వానిం దీసికొని యాస్థానమున కరిగెను. అంతకుమున్న రాజపుత్రిక సఖురాండ్రిరువురు వాని రాకకై యందు వేచియుండిరి.