పుట:కాశీమజిలీకథలు -04.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావతికథ

307

పని చేయక యింతకాల మూరక పోగొట్టితిని. నేనిఁక నింటికింబోవలయు. జాలిపడిన నా మీఁదికి రాగలదు. నేడు దీని నెత్తిపై నాపాషాణమువైచి చంపెద. నట్లైన నాచాన బాధ తెలియక తృటిలోఁబ్రాణము బాయఁగలదు. ఇదియే యుచితమనితలచి యందున్న యొక పెద్దశిలయెత్తి నెత్తిపై వేయఁబోయి యంతలో నాహా ! మఱచిపోయితిని. దుర్మరణము జెందిన వారు పిశాచమగుదురని చెప్పుదురు. ఇప్పుడు దీనింజంపితినేని బిశాచమై యీ యడవిలో నాపని పట్టకమానదు. ఇదియు నుచితముగా లేదని తలంచి యారాయి నేలం బారవైచెను.

ఈగతి నతండా చిన్నదాని జూచిచూచి చంపలేక యెత్తికొని తిరుగుచుండ గొన్నిమాసములు గడచినవి. ఒకనాఁడా కళావతి యతనితోఁ దాతా ! నీకు దారి తెలియదాయేమి యెప్పుడు నడచిన నడవి తెరువుననే నడుచుచుండెదవేల ? మార్గములో గ్రామములులేవా ? పాపము నన్ను మోచువఱకు నీ భుజములు కాయలు కాచుకున్నవి. నీ యుపకారమునకు ప్రీతి యెన్నడు చేసికొందునో ? యని స్తోత్రము చేయగా నుబ్బుచు నతండు అమ్మా మీ యూరికి దారి నాకుఁదెలియదు. దానంజేసి యిన్ని చిక్కులంబడుచుంటి. నిన్ను మోచుటచే నాకేమియు నలసటలేదు. ముష్టిమూటలు మోయుటచే నిదివఱకే నా భుజములు కాయలు కాచినవి. నీవు సంతసించినఁ జాలునని పలుకుచు మఱికొన్నిఁ బయనములుచేసి దై వికముగా నొకనాడు కుముద్వతి యను పట్టణము జేరెను.

అందొక సత్రంబునభుజించి యతండా బాలికతోఁగూడ నందలి చావడిలో విశ్రమించి నలుమూలలు విమర్శింపుచుండ నెదుటి గోడపై నొక ప్రకటన పత్రిక గనంబడినది. అందు ఏతత్పట్టాణాధీశుండగు కుముద్వంతుని కూఁతురు కౌముదితోఁ జదరంగమాడి గెలిచిన వారికిఁ బదివేలమాడలు కానుకగా నీయబడును. ఓడిపోయిన పురుషుండు తక్షణ మురితీయఁబడునని తత్ప్రకారమంతయు నందు వ్రాయఁబడి యున్నది.

ఆ పత్రికఁజదువుకొని యాధాత్రీసురుం డుబ్బుచు నబ్బాలికతో నమ్మా ! నీవు నేర్పుగాఁజదురంగ మాడుగలనని నాతోఁజెప్పియుంటివి. ఈ దేశపు రాజుకూతురు కౌముదితో నాడి గెలువఁగలవా ? పది వేలమాడలు కానుక యిత్తురట. ప్రకటన పత్రిక చూచితిరా యని పలికిన నక్కలికి కలుకుచు తాతా ! నిజముగా ఆడి యా చేడియం గెలువఁగలను. పదివేలమాడలు నీచేతిలో నున్నవని తలంచి యుండుము నే నాడెదనని వారితోఁ జెప్పిరమ్మని యుత్సాహంబు దీపింపఁబలికిన నతండుబ్బుచు నాత్మగతంబున నిట్లు తలంచెను.

ఆహా ! దైవమ ప్రయత్నముననే కార్యములు సఫలము జేయుచుండును. నా భార్య మాటచొప్పున నీ బాలికను దారిలోఁ గడతేర్చకపోవుటయే మేలైనది. ఈచేడియ చదరంగమాడి యోడిపోయినచో నాచేతితోఁ జంపనక్కరలేకుండ వారే కడతేర్చుదురు.