పుట:కాశీమజిలీకథలు -04.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అదిగో లేచుచున్నట్లు కనంబడుచున్నదని బెదరుచు గదలక ప్రాణములు పోయిన వానివలె నిలువంబడియున్న యా బ్రాహ్మణుఁ గాంచి యా చిన్నది యల్లన లే వృద్ధుఁడా నేను పెద్దపులి ననుకొన్నావా ? భయములేదని పలుకుచు నతనిదెసకు రెండడుగులు నడిచినది.

అప్పు డతండు తల్లీ ! నీకు నమస్కారము. నాజోలికి రాకుము నాకుఁ బెక్కండ్రు పిల్లలు కలిగియున్నారు. నేనొక్కరుండ వారికిదిక్కు రక్షింపుమని పలుకుచు వెనుక తిరిగి కాలికొలది పరువెత్తెను. ఆ చిన్నదియు నట్టడవిలో మనుష్య సహాయము దొరకెనని సంతసించుచు నతని వెఱపునకు నవ్వుకొనుచు లేచి యా దెసకే నడువఁ దొడంగినది.

అప్పు డతండు కొంచెము దూరము పరుగెత్తి వెనుకకుఁ దిరిగి చూచెను. ఆ చిన్నది తనవెనుక వచ్చుచుండుటచూచి తన్నుఁ జచ్చినవానిగా నిశ్చయించి పోవుటకు కాళులురాక తడఁబడుచుండ నా ముష్టిమాటలు బరువై దిగజారి కాళ్ళకుఁ దగిలికొన మెలికెపడుటయు నేలం జతికిలఁ బడియెను.

అంతలో నాచిన్న దివచ్చి కలిసికొని తనుఁజూచి వెఱచి పిరికి తనమునఁ బారిపోవుచున్నాఁడని తెలిసికొని భయం బుడుపఁదలంచి నేలంబడిన యప్పుడమివేలుపు చేతులు పట్టుకొని లేవనెత్తఁబోయినది. అప్పుడప్పాలఱుఁడు మొఱ్ఱోయని యఱచుచు “నన్ను బ్రహ్మరాక్షసి జంపుచున్నది. ఎవ్వరైనవచ్చి రక్షింపరే" యని యఱచెను. అప్పుడా చిన్నది నవ్వుచు విప్రుఁడా" నేను బ్రహ్మరాక్షసినికాను, కృష్ణదేవరాయల" కొమార్తెను. నా పేరు కళావతి యండ్రు నీవేదియో నాకు సహాయము చేయుదువని తలంచి నీదాపునకు వచ్చుచుండ నన్నుఁజూచి పారిపోయెదవేమిటికి ? లెమ్ము. లెమ్ము. నన్ను మాయూరుజేర్చితివేని నీదరిద్రము వాయఁజేసెదను. నన్నిప్పుడు మాయింటికిఁ దీసికొని పొమ్మని నైపుణ్యముగాఁ బలికిన నమ్మకతఁడు వివశుండై బహ్మరాక్షసమా ! నీవీలాగనేచెప్పి ప్రాణములు తీయుదువఁట. నీమాట యెట్లు నమ్ముదును? ఇంతమంది యుండ నీకు నేను దొరకితినా విడువుము, విడవుము. నీపేరు చెప్పుకొని బ్రతికెద నని యొడలెఱుంగకయే వేడుకొనఁ దొడంగెను. అయ్యో! ---బ్రహ్మాణుఁడా నామాట నమ్మవేమి ? నేను బ్రహ్మరాక్షసినైనచో నిన్నింతసేపు బ్రతిమాల నేటికి? ఈపాటికే మ్రింగివేయుదును. దైవముతోడు. నేను రాజపుత్రికను, నన్ను మావిజయనగరము జేర్పుము. నీకు మంచి పారితోషిక మిప్పింతునని రెట్టించి నాలుగుసారులు చెప్పగా నెట్టకేఁ గొంచెము ధైర్యము దెచ్చుకొని నీవు రాజపుత్రికవైనచో నొక్కరిత నిక్కడి కెట్లు వచ్చితివని యడిగిన నమ్మగువ యతని కిట్లనియె.

అయ్యా ! నావృత్తాంతము వినిన నీవిట్లు జడియక పోవుదువుగదా ? నిన్న రేయి మాయంతఃపురములోఁ జాలప్రొద్దుపోవు దనుక శాస్త్రచింతనచేసి పండుకొంటిని. ఇదియేమి యింద్రజాలమో తెలియదు. నేఁటి యుదయమున నీయడవిలో