పుట:కాశీమజిలీకథలు -04.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

స్వామీ ! నేను పుట్టినది మొద లెన్నఁడును క్రింద బరుండి యెరుంగను. ఇక్కడకు వచ్చినది మొదలు పుడమిఁ బండుకొను చుండుటచే నాకాళులన్నియు సడలి పోయినవి. అబ్బా వెన్నెముక కొంచెమయినను వంగుటలేదు. ఎద్దియయిన పట్టు వైచుకొనవలయునని తలంచుచుంటి నిప్పుడు మీపాదములకు శిరంబుసోక మ్రొక్కజాలను. నిలువంబడి యుండిన మంత్రోపదేశము సేయరాదా ? యని యడిగిన నయ్యతి అదిగో ! నీస్వభావము విడిచితివి కావుఁ యతికిఁ బ్రతి చెప్పుచుందువు. ఒక్కతృటికాలము లలాటముమోపి నిలువలేవా ? ఇంతమాత్రము శ్రమపడక మంత్ర సిద్ది యెటులగను ? మేము పడియెడి యిడుమలఁ జూచుచుండలేదా ? శరీరము మృదువు సేయరాదు సుమీ ! యని పలికిన వసుంధరుండు స్వామీ ! మీమాట కడ్డు చెప్పినఁ గోపము వచ్చుచున్నది. మీ యిష్టము వచ్చినట్లే చేసెద మఱియొండు వినుండు పలుమారిట్టట్టనిన నేను వంగలేను. ప్రణామవిధి యెట్లో నాకుఁ జూపింపుఁడు అట్లు గావించి మంత్రోపదేశము పొందెదనని పలికిన సంతసించుచు నతండింత చదివితివి. ప్రణామవిధియే తెలియదా ? ఇదిగో ! చూడుము ఇట్లేయని యతని పాదముల దాపున బోరగిలఁ బండుకొనియెను. అప్పుడా క్షత్రియకన్యకా పుత్రుఁడంతకు ముందు తన శిరంబు ఖండింప నాసనాసచే నాప్రాంత స్తంభము చాటునదాచఁబడిన ఖడ్గమును గయికొని వాని జటాకలాప నెడమచేతితో నదిమిపట్టి యోరీ ! ముప్పదియేండ్లు కందమూలములం దిని తపంబు జేసియు గనికరము బూనక భోగంబుల కాసపడి కపటంబున నన్నుఁజంప నుద్యుక్తుండ వై యీకత్తిఁదెచ్చి దాచితివి దురాత్మా ? నీ దుర్బుద్ధి నే గ్రహింపలేననుకొంటివా ? యీకత్తియే నీపాలిటి మిత్తియై ప్రాణముల గ్రోలు చున్నది. నీయిష్టదేవతలఁ దలంచుకొమ్మని పలికెను.

అప్పుడామాట విని యాబడుగు సన్యాసి కదలలేక హా ! వసుంధరా ? హా ! వసుంధరా ? చంపకు చంపకుము రక్షింపుము రక్షింపుము విడువుము. నీ దాసుండనై తిరిగెదనని బ్రతిమాలఁ దొడంగెను. వాని దీనవచనంబులు విని జాలి వొడమ నా విప్రకుమారుండు ఓరీ ! నీచా ! నీవు నన్నుఁజంపుట కుద్యుక్తుండవైతివా లేదా నిజము చెప్పుము. నిన్ను విడుతుననుటయు నతండు జంపబూనినమాట నిజమే గడ్డిం గరచితిని విడువుమని గిలగిలఁ కొట్టికొనుచు వేడికొనియెను.

అంతలో క్షత్రియ దౌహిత్రా ! వీని విడువకుము నాకు బలియిమ్ము . తృటిలో నీకు వశమగుచున్నానని యశరీరవాక్య మొకటి వినంబడినది. ఆ మాటవిని వసుంధరుడు అమ్మా ! నేను వీనియింటఁ బదిదినములు గుడిచితిని ఆ విశ్వాసము హృదయము బాధించుచున్నది. వీనిం జంపుటకు జేతులురాకున్నవి. అదియుంగాక తుచ్చభోగంబుల గాసపడి బ్రహ్మహత్య చేయుదునా ? అవసరమయినప్పుడు నీవు నన్ను గాపాడుచుండు మదియే నాకుఁ బదివేలని ప్రార్థించుటయు మేలు మేలు : నీ కృపాశీలమునకు మెప్పువచ్చినది. భవదీయ విషయభోగపరాజ్ముఖతకు సంతసించితిని.