పుట:కాశీమజిలీకథలు -04.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యక్షిణిదేవి కథ

299

రాదని తలంచి మూఁడవనిబంధనముపయి మఱల మట్టిరాచి తెలియకుండ నెప్పయ యట్ల యాముని యొద్దకు బోయి కూర్చుండెను. తుందిలుండును వాడుక ప్రకారము జపావసానమున వానితోఁగూడ సరస్సునకుంబోయి స్నానము జేసి పర్ణశాల కరిగి భుజించెను. ఈ రీతి వానితో నత్యంత ప్రీతిపూర్వకముగా మాటలాడుచు నాదరించుచుఁ దొమ్మిదిదినములు గడి పెను. దొంగకు దొంగయై వసుంధరుండు వాని చర్యలన్నియు నరయుచునేయుండెను.

పదవనాఁడు వాడుక ప్రకారము స్నానముజేసి వారిరువురు గుడికిఁ జనిరి. తుందిలుఁడు ముఖమంటపమునం గూర్చుండి వత్సా ! వసుంధర ! నీయందు మా కెక్కుడు వాత్సల్యము గలిగినది. నేఁడు నీకొకమంచిమంత్ర ముపదేశము గావించెద దాన సిద్ధుండవయి పక్షివలె మీదేశమునకుఁ బోఁగలవని చెప్పిన విని యతండు మహాత్మా ! ఆ మంత్రము మీరనుష్ఠానము గావించితిరా ? మీకు సిద్ధియైనదా ? యని యడిగెను. అతండు సందియమేలా ? మాకు సిద్ధించనిదే నీకుపదేశము చేయుదుమా ! తప్పక నీవు పక్షివలె నెగరఁగలవని మఱల జెప్పెను.

స్వామీ ! మీకట్టి సామర్థ్యమున్నదియా ? యేది యొకసారి యెగిరి చూపింపుడని శంకించినఁ దల కంపించుచు నతం డోహో ! విషమప్రశ్నములు వేయుచుంటివే ? నీకే మేముత్తరము చెప్పలేమనుకొంటిరా యేమి. ఒక మంత్రానుష్ఠానము చేయుచున్నప్పుడు మఱియొకటియనుష్టేయము కాదు. దానంజేసి ప్రత్యక్షము నీకుఁ జూపుటకు వీలులేదని చెప్పెను. స్వామీ ! అట్లయి నాకిప్పుడు మంత్రోపదేశము మాత్రమెట్టు చేయుదురు ? దానికతి వ్యాప్తి కాదా యని వసుంధరుడు పలికినఁ గన్నులెఱ్ఱ చేయుచు నోరీ ! బాలికా ! నీతో మేము చనువుగా మాటలాడుచున్నా మనియా ? యిన్ని శంకలు చేయుచున్నావు ? చాలు ! చాలు ! గురువుల కెప్పుడు తోచునో యప్పుడు చెప్పుదురు. దానంగాదె వారినెప్పుడు ననుసరించి తిరుగవలయు నని పెద్దలు చెప్పుదురు. ఇన్ని మాటలేల నాయొద్ద సుపదేశము పొందుదువా ? పొందవా ? యొకటే మాట చెప్పమనియు నతం డీషత్స్మితలలిత వదనార విందుండయి స్వామీ ! కోపగింపకుఁడు మీశిష్యుఁడఁగాన నింత నిర్భయముగా మాటాడుచుంటి శతానందయోగి యొద్ద మీరుచునువుగా మాటలాడలేదా ? కానిండు అటులే యుపదేశము పొందెద నందులకేమి చేయవలయునని యడిగెను. అప్పుడతండు నవ్వుచు వత్సా ! మాగురువు నొద్ద నేనెంత జడియుచుండువాఁడనో నీ వెఱుంగుదువా ? నీవలె కుశంకలు చేసితినేని బ్రతుకనిచ్చునా ? వినుము నీవేమియ మాకు గురుదక్షిణ నీయనక్కరలేదు. నాపాదముల రెంటిపై శిరంబిడి నానుడివిన మంత్రం బుచ్చరింప వలయు నిదియే చేయఁదగిన కృత్యంబని పలికిన విని యావిన్నాణి జాపురే ? మూఢ ? నీకపటం బెఱుంగని మందమతి చెంత నిట్టు పలుకుము. నా కడనా ! యని యంతరంగమున నిందించుచు వాని కిట్లనియె.