పుట:కాశీమజిలీకథలు -02.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

కాశీమజిలీకథలు - రెండవభాగము

గూడ దీసికొనిరమ్ము. ముందుగా బ్రియంవదను దమ్మునికి వివాహము చేయవలయును. తరువాత బైకార్యములు చూచుకొందమని పలికెను. ప్రియంవదయు వారిరువురను జూచి యించుకయు భేదముగానక యాశ్చర్యమందుచు, గలహంసికా! ఇది యేమి చిత్రము! దేవమాయగా దోచుచున్నది. పూర్వము దమయంతిని వరించుటకు వచ్చిన దిక్పాలుర పోలికగా నిందెవ్వరో యిట్టి రూపమున వచ్చినట్లు తోచుచున్నది.

ఇందు నా ప్రశ్నముల కుత్తరము జెప్పిన వాడెవ్వడో నిరూపింపుము. వీరి వృత్తాంత మెట్టిదో చక్కగా దెలిసికొనుమని పలికిన నక్కలిహంసికయు వారి దాపునకుబోయి మ్రొక్కుచు నిట్లనియె ఆర్యులారా! మీరిరువురు నొక్కరూపున నున్నవారు. వీరన్నదమ్ములని తోచుచున్నది. మీలో మా మిత్రురాలు కోరిన ప్రియుండెవ్వడు? దాని ప్రశ్నములకు సదుత్తరములిచ్చిన బుద్ధిశాలిని నిరూపించి చెప్పుడు! ఇంతకుమున్ను యెఱుగక ప్రియుండని భ్రమజెందిన తప్పు మన్నింపవేడెదనని పలికిన విని యదృష్టదీపుం డిట్లనియె.

కాంతా! నీవు మమ్మడుగనేల? నీ నెచ్చెలి యెవ్వరిని వరించినదో వాడే ప్రియుండగుగాని యన్యుండెట్లగును. ఈ మాత్రమే తెలిసికొనలేదా? ఇటువచ్చి చూచుకొనుమని పలికిన నక్కలికియు గ్రహించి అచ్చటికి వచ్చిన వానిని గురుతు పట్టలేక విస్మయముతో జూచుచుండెను. అప్పుడు బలభద్రుడు అదృష్టదీపునితో, నన్నా! నీ మాటలలో నాకొక సందియము పుట్టుచున్నది. ఓషధిలత చేయిచిక్కినవాడే నిధులకధికారి యనియు బ్రియంవదకు బ్రియుండనియు నమ్మవారిగుడిలో వ్రాసియున్నది. కావున నది నీ చేత జిక్కెనుకదా! ప్రియంవదకు హరిదత్తుడెట్లు ప్రియుండగునని యడిగిన నతండొక్కింత ధ్యానించుచు హరిదత్తుని చేయిపట్టుకొని తమ్ముడా! రమ్ము ఇచ్చట నొకచెట్టు వెదుకవలయునని పలికి యతని నా దాపునకు దీసికొని పోయి అచ్చట నొకచోటబడియున్న నిర్మాల్యద్రవ్యములను జూచి గురుతుపట్టి యాపత్రిలో జేయి పెట్టించి వెదకించెను.

అప్పుడా లత హరిదత్తుని చేతికి దగిలినది. దానంజేసి మణిప్రభలతో వెలుగుచున్న యామేడ అతనికిం గనంబడినంత వెఱగందుచు. అన్నా! యిదియేమి చోద్యము. ఇప్పుడు నా కన్నుల కొకవింతభవనము గనంబడుచున్నది. యెచ్చటిదని అడుగగా గ్రహించి అప్పటి కతని చేతిలోనున్న యోషధి నంది పుచ్చుకొని, తమ్ముడా! యిప్పుడేమి కాన్పించుచున్నదని యడిగెను. ఆతండిప్పుడేమియు గనంబడుట లేదనియు మొదట గనంబడిన మేడ యదృశ్యమైనదనియు నుత్తరము జెప్పెను. అదృష్టదీపు డయ్యోషధీలతను విడువక దిట్టముగా బట్ట చెరగున మూటగట్టుకొని యందలి విశేషము లందరకును చూపదలంచి బలభద్రునితో, తమ్ముడా! నీవు చేసిన శంకకు సమాధానము దోచినది. చివరకీలత హరిదత్తునిచేతనే చిక్కినది. నేను తీసుకొంటిని కాన నయ్యనుమానము వదలినది.