పుట:కాశీమజిలీకథలు -02.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

కాశీమజిలీకథలు - రెండవభాగము

శంకంజేసి యించుక గొంకుచు నోరగా బోయినది పిమ్మట బలభద్రుం జూచి అదృష్టదీపుడు గౌగలించుకొని తమ్ముడా! హరిదత్తునిజాడ నీకేమైనం దెలిసినదా! నీవు లేక పోవుటచే నాకేమియుం దోచినదికాదు సుమీ! ఇన్నిదినము లేయే చోట్లకు బోయితివి. ఏయే వింతలం జూచితివని అడుగగా నతండు నవ్వుచు అన్నా! నీ బుద్ధికి దైవసాన్నిధ్యము గలదుసుమీ? నీకు హరిదత్తునం దకారణవాత్సల్యము గలిగినందులకు నేనెంతయో వింతపడితిని. ఇప్పటికి దెలిసినది వినుము. హరిదత్తుడు నీ తమ్ముడు. మీ యిరువురకు రూపంబున నింతయేని బేధము లేదు. నేనును గ్రహింపలేక పోయితిని. కాంతిమంతియు నామె తండ్రియు జతురికయు నతనింజూచి నీవే యని భ్రమజెంది అతని బెక్కుచిక్కులంబెట్టిరి. రత్నపుగనిలో సామాన్యపు పాషాణమేల జనియించును. వారెన్ని గతుల నిర్బంధించినను బరకాంతయను వెఱపుతో వారి మాటలకు లోబడకుండె. నంతలో నేను బోయి వారి యనుమానము దీర్చి అతని నిచ్చటికి దోడ్కొని వచ్చితి. నిన్ను జూడ మిగుల వేడుకపడుచున్నవాడని తాను జూచివచ్చిన విశేషములును, సత్రములో గనంబడిన బ్రాహ్మణుని చరిత్రము, రత్నవతియను దాది చెప్పిన మాటలును నా మూలచూడముగా వక్కాణించెను.

అప్పుడు అదృష్టదీపుడు మేనంతయు జెమ్మటలుగ్రమ్మ గంపముతో, నేమేమి! నా ముద్దులతమ్ముడు హరిదత్తుడే? ఎంత ప్రియమైన వార్త వింటిని. ఈ దివసం బెంత సుదినము! నేడుదయముననే సుముఖుని మొగము జూచితిని! అత డెచ్చట నున్నాడు. మా తండ్రిని బందీగృహములో బెట్టిన దుర్మార్గుండెవ్వడో మరల జెప్పుము? ఆ రత్నవతి యెచ్చట నున్నది! నా తమ్ముని యుద్ధరించిన విప్రునివెంట దీసికొని రాక అచ్చట విడిచి వచ్చితివేమి? అయ్యయ్యో! మా తల్లి యెచ్చటనున్నదియో కదా! బాల్యంబున మా కెట్టి యిడుములు వచ్చినవి. కటకటా! నా మూలమున నింబవతి ప్రాణములు బోగొట్టుకొనియెనే అని అనేక ప్రకారముల విచారించుచుండ నతనితో బలభద్రుడు వెండియు నిట్లనియె.

అన్నా! గతమునకు వగచిన నేమి ప్రయోజన మున్నయది. ఇంతకును కాలము గదా మంచిచెడ్డలను గలుగజేయునది! అది యిప్పుడు మన కనుకూలమైనందున నన్నియు సమంచితముగా నున్నవి. యీ కాంత యెవ్వతె చిహ్నములఁబట్టి ప్రియంవద యని తలంచుచుంటి. ఈ వాల్గంటిని హరిదత్తునకు గూర్తునని యిదివర కనుచుంటివే. ఇప్పుడు ఆ మాటలు మరచితివా యేమి అని అడుగగా నతని కతండిట్లనియె. తమ్ముడా! మేరువు చలించినను నేను పట్టిన శపథమును విడుతునా? నేనిచ్చటికి వచ్చునప్పటికి ఆ మచ్చెకంటియు నిచ్చటనే యున్నది. నన్నెట్లు గురుతుపట్టినదో యెరిగినట్లు మాటలాడినది.

మరియు నోషధీలత యీ లతాంగి చేతజిక్కి జారిపోయినది. అది పడిన తావు గురుతు పట్టవచ్చును. దానికొర కాలోచింపుచుండగా నింతలో నీవు వచ్చితివి.