పుట:కాశీమజిలీకథలు -02.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిదత్తుని కథ

235

విశేషము లేవియో చూచివచ్చెదంగాక అని నిశ్చయించుకొని యాసజ్జ చేతంబట్టుకొనియే యామేడలోనికి బోయినది. అందదృష్టదీపునికి గనంబడిన విశేషములన్నియు నా చిన్నదానికి గనంబడినవి. ఆ రత్నములు చూచే తన కతడు తెచ్చియిచ్చిన రత్నము లిచ్చటనే అని నిశ్చయించి యమ్మచ్చెకంటి విచ్చలవిడి అందుగల వింతలన్నియుం జూచి యతీశ్వరుడిచ్చిన ప్రశ్నము లీసౌధవిశేషములే అని యూహింపుచు నందున్న భువనేశ్వరీదేవి తన అభీష్టదేవత అని నిశ్చయించి తన సజ్జలోనున్న పూవులచేత నయ్యమ్మవారిని బ్రత్యక్షముగా నర్చించెను.

అప్పుడు యోషధీలత యప్పూవులతోగూడ నమ్మవారి పాదంబులం బడినది. కన్నులు దెరచి చూచినంత నాసౌధము ప్రియంవదకు గనంబడక అదృశ్యమైనది. ఆ సుందరియు యథాపూర్వకముగా నున్న శిఖరమును జూచి యాశ్చర్యమందుచు నదియొక యద్భుతమైన యింద్రజాలమని తలంచి యావిశేషములు తనసఖుల కెరిగింప నతివేగముగా బోవలయునని తలంచుచున్నంత నదృష్టదీపుడు పూర్వము బలభద్రునితో జేసిన సంకేతస్థల మదియే కావున నాసమయమున కచ్చటికి వచ్చెను.

అట్లొండొరులు తారసిలినంత నన్నెలంత యతని హరిదత్తుడే అనుకొని నమస్కరింపుచు ఆర్యా? మీరింతలో నిచ్చటికేల వచ్చితిరి. నేనును మీకొరకు వేగముగానే దేవినర్చించి వచ్చుచుంటిని ఇంతలో నాకొక విచిత్రసౌధము గనంబడినది. అది యిదివర కెన్నడును జూచినదికాదు. దానిలోనికిబోయి చూచితిని. ఆహాహా! అందలి విశేషములు చెప్పుటకు శేషుడైనను జాలడు నవరత్నములకు నదియే యాకరమని చెప్పవచ్చును. మీరు నా నెచ్చెలికిచ్చిన రత్నము లందలివే యని తోచుచున్నది. నేనట్టి విశేషములన్నియు జూచుచు నాసజ్జలోనున్న పూవులచే నమ్మవారి సర్చించితిని. ఇంతలో నదియంతయు నంతర్థానమైపోయినది.

ఇది యేమిమాయయో తెలియదని చెప్పగా నతడు గ్రహించి యయ్యువతి చేసిన చెయ్వులన్నియు నడిగి తెలిసికొని అచ్చటికిబోయి తానుగూడ నా లతను వెదకుచు బలభద్రుడు వడిగా గొండనెక్కు చుండుటయు నతని వెనుక రాజభటులు పోవలదు పోవలదు భర్తృదారిక మనోహరునితో విహరించుచున్నదని పలుకుచు వెనుకదరుముకొని వచ్చుచుండుటయు జూచెను. అప్పుడతండు ఓహో! రానీయుడు, రానీయుడు. ఆతడు మా మిత్రుడేయని హస్తసంజ్ఞచే వారిని వారించెను. ఆ సన్నగ్రహించి యాసన్నవర్తులగు రక్షకపురుషులు వానిని బోనిచ్చిరి.

అంతట బలభద్రుడు వనితాసహాయుండైయున్న యతనింజూచి యీతండు హరిదత్తుడా! అదృష్టదీపుడా! అను సందియముతో దాపునకు బోవుటకు వెరచుచుండగా జూచి అదృష్టదీపుడు మిత్రమా! రమ్ము రమ్ము. దవ్వుగా నిలచితి వేల? అన నతండు దాపునకు బోయెను, అప్పుడు ప్రియంవద పరపురుషసమాగమ