పుట:కాశీమజిలీకథలు -02.pdf/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
233
హరిదత్తుని కథ

నిజము జెప్పుడు. తరువాత దగు సమాధానము జెప్పెదనని పలుకగా విని అక్కలకంఠి యిట్లనియె. ఆర్యా! నీ వెరిగియుండియు నిట్లడుగుచున్న మే మేమి చెప్పుదుము. నీవు నాకొరకు మొదటినుండియు నెన్నిపాట్లు పడితివి. బందీగృహవాస మనుభవించితివికదా? తుదకెట్లో నా ప్రశ్నమునకు సమాధానము చెప్పితివి. అట్టి సమయములో దీక్షాకైతవంబున మితిగోరి యెచ్చటికో బోయితివి. అన్నియు జేసి యిప్పుడు నే నేమియు నెఱుగ ననుచుండ మే మేమి జేయగలవారము నీ పేరు హరిదత్తుడగునా కాదా? నీవు వ్రాసిన యుత్తరము గూడ గలదు. కావలసిన దెప్పించెదనని పలికిన అతండొక్కింత ధ్యానించుచు నందులో గొన్ని చర్యలు తాను నడిపించినవే గనుక నిదానించి చివర జరిగిన కృత్యములు గురుతులేనందున మరల యిట్లనియె.

కాంతా! ఆ వృత్తాంతమేమియు అంతగా జ్ఞాపకములేదు. కొంత కొంత జరిగినట్లే యున్నది. దాన నేమియగు. నీవెవ్వని భార్యవు నీ తల్లిదండ్రులెవ్వరు? నీ పేరేమి? అని యడిగిన నమ్మగువయు దెల్లబోవుచు నోహో! యితండు నిజముగానే యిట్లనుచున్నడా యేమి? కలహంసికా! నాకు మెడలో పూవుదండవైచిన వాడితడే యగునా? బాగుగా గురుతుపట్టితివా? ఇతండిట్లనుటకు గారణమేమని అడిగిన నచ్చేడియ యిట్లనియె.

ఇంతీ! నేనంత వెర్రిదానననుకొంటివా యేమి? యితని నంతకు ముందు నుండియు నెఱుంగుదును. అతండిచ్చిన తాటిపండు ప్రశ్నలకు నీవుత్తరమిచ్చినప్పుడు దోసెడు రత్నములు కానుకగా దెచ్చి యిచ్చినవాడు యితడు కాడా? మనలను వెరపించుట కిట్లనుచున్న వాడు కాని మరియొకడు కాడని యా పైదలికి సమాధానము చెప్పినది అప్పుడు ప్రియంవద మరల నతనితో ఆర్యా! నీ వచనములన్నియు విపరీతముగా నున్నవి. అయినను నీవడిగితివి కావున జెప్పుచున్నదాన నా పేరు ప్రియంవద. మా తండ్రిపేరు రాజవాహనుడు. నేను హరిదత్తుడను వాని భార్యను. మనోవాక్కాయకర్మలచే నే నతనిని వరించితిని. యింతకన్న నేమియు నెఱుంగ. అతండు నా యిచ్చిన ప్రశ్నములకు సదుత్తరములిచ్చి నన్ను భార్యగా బడసెను. యీ మాటు దెలిసినదా యని యడుగగా నతండు విస్మయస్వాంతుడై మరల నిట్లనియె.

మదవతీ! మొదటి మాటలన్నియు నుచితముగా నున్నవి. కాని చివర మాటలకు నాకర్ధమైనది కాదు. హరిదత్తుడు నీ ప్రశ్నముల కెట్లు సమాధానము జెప్పెనో తెలియకున్నది. అతడు వ్రాసిన యుత్తరమున్నదని చెప్పితివి దాని నొకసారి రప్పింపుమని పలుకగా నక్కలికి తల కంపించుచు దిగ్గునలేచి సిగ్గువిడిచి బిగ్గర గౌగిలించుకొనుచు నాకీపాటి స్వతంత్రమున్నది. ఇక నీవేమి చేయుదువో చూతములే