పుట:కాశీమజిలీకథలు -02.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

కాశీమజిలీకథలు - రెండవభాగము

కెత్తి యాలోచించుచున్న సమయంబున నతనిచేయి పట్టుకొని అది ఆర్యా! రమ్ము రమ్ము నీవేలాగైనను రాకతప్పదు. నిన్ను విడచి పోవుదానను కానని పలుకుచు బండిలోనికి లాగికొని పోయినది.

అతండు దానితో గూర్చున్న వెంటనే యాబండి తోలించుకొని యాకలహంసిక తృటిలో నుద్యానవనము లోనికి పోయినది. వారిరాక కెదురు చూచుచున్న ప్రియంవదయు నా బండి చప్పుడు వినినంత సంతోషముతో గొంతదూర మెదురుగా గొందర జెలికత్తెల నంపినది. వారును బుష్పమాలికలు గొని యెదురుగాబోయి కలహంసికతో వచ్చుచున్న అతని మెడలోవైచి పాదంబులుగడిగి తడియొత్తుచు వింజామరల వీచుచు ఛత్రంబు పట్టి వెనుక నడువదొడంగిరి.

అదియంతయు గాంచి అతండు విభ్రాంతుండువోలె జూచుచు అయ్యో! వీరు నన్నేమిచేయుదురో? ఇది కలలాగున దోచుచున్నది. లేక యింద్రజాలమో! నా స్నేహితుడు బలభద్రుడుగూడ మోసగాడు కాడుగదా? కానిమ్ము దైవమేమి చేయ దలచుకొనియెనో యట్లు కాకమానదుగదాయని అంతలోనే ధైర్యము దెచ్చుకొనుచు నీరీతి గొంతసేపు పలుతెఱంగుల స్వాంతమున దలపోయుచు నాకలహంసికతో నడిచెను. కలహంసికయు అతనిని గ్రమంబున బ్రియంవద యున్న లతాగృహంబునకు దీసికొనిపోయి యందమర్చిన పూవు పాన్పున గూర్చుండబెట్టినది

అతండప్పుడు కలహంసికతో బోఁటీ! ఈపాటికి నాతోనున్న పనిచెప్పి నన్ను విడిచి పెట్టుము. నా కొరకు నామిత్రుడు వేచియుండును. మీరందరు నిచ్చటికేల వచ్చితిరి. యింతగా నన్ను గౌరవించుటకు నేను మీకేమి కావలసినవాడను. ఇట్టి యాపదలు యిదివరకొకటి రెండనుభవించితిని. బలభద్రుని మూలమున నవి దాటితిని. ఇప్పుడు మరల దటస్థించినది. వేగమె నన్ను బంపుడని పలుకగా విని కలహంసికతో మాటుగా నిలువంబడి ప్రియంవద యిట్లనియె. చెలీ! ఆర్యపుత్రునకు మనయందనురాగము తప్పినదా యేమి? యీయన మాటలు మరియొక రీతి నున్నవే! యింతకాలము జాగైనందులకు జింతించుచున్న మనల నోదార్పక యెద్దియో పలుకుట యుత్తమ ధర్మమా? భవాగమనం బభిలషించు చాతకమువలె వారి రాక మనము వేచియుండ దిరస్కరింప వలయునా? తెలిసినది. తమ్ము మొదట అవమాన పరచితిమని కాబోలె పూర్వరాజకన్యల దలంచుకొనిన అది తప్పని తోచదు. శపథభంగము క్షత్రియధర్మము కాదుగదా? నా యపరాధములన్నియు మన్నింప మ్రొక్కుచున్నదాన రక్షింపుడని పలుకుచు దటాలున జనుదెంచి అతని పాదంబులబడినది.

అప్పుడు మెరపు తీగియవలె దళ్కుమని మెరయుచున్న యా చిన్నదానిని జూచి మోహపరవశుండయ్యెను. పరకాంతయను వెరపు హృదయంబున నుత్తలపెట్ట నిట్టట్టు దెమల్చుకొని, అయ్యో! కాంతలారా! మీరెవరో తెలియకున్నది. పూర్వపరిచయ మున్నట్లు మాటలాడుచున్నవారు. మీ మాటలేమియు నా కర్దమగుటలేదు.