పుట:కాశీమజిలీకథలు -01.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఎంతలేసి సౌందర్యవంతు లుందురో కదా? ఒక్కొక్క దేశమునంగల స్త్రీలచాతుర్యంబులు వర్ణింపనలవియా? మహారణ్యంబులు మహానగరంబులు దిరిగిన దివ్యౌషధీవిశేషంబు లెన్ని సంపాదింపవచ్చును. తల్లిదండ్రులు మన గమనమునకు సమ్మతింపరు. వా రెఱుంగకుండఁగనే పోవలయును. సంవత్సరములో నంతయు దిఱిగి రావచ్చును. విద్యాభ్యాసమునకై తల్లిదండ్రుల విడిచి విదేశంబునఁ బెక్కుసంవత్సరములు వసించినవా రెందరో యున్నారు. మనము పోయితిమేని వారి కది సరిపడియుండును. వేగమే వత్తుమని వ్రాసిపెట్టి యేగుదము. మృత్యువువలన భయము లేకుండ మన యాయువులు గుప్తముగా దాచు పాటవము నాకుఁ గలదు గదా! అట్లు చేసిన మనము యమపురి కఱిగినను భయములేదు. అన్ని విధములచే నొకసారి దేశములు తిరిగివచ్చుటయే శ్రేయమని నా యుద్దేశ్యము,

సాంబుడు — నేను బిరికితనమునఁ జెప్పిన మాటగాదు. మీయందఱికన్న ముందడుగు వేయఁగలను. అనంతములైనను దేశములు గ్రుమ్మరుచుండ నొక యబ్దకాలము సరిపోవునా? మన సంకల్పప్రకారము జరుగదు. కానిండు మీ నలువుర యభిమతములకు నేను వ్యతిరేకము చెప్పువాడనా? తప్పక భూమియంతయుఁ జూచి రావలసినదే.

వసంతుడు – మిత్రమా! సాంబ! నీవు చెప్పినదంతయు సమంజసమైనదే. కావలసినంత ధనము దీసికొని పోవుదము. మీరు నలువురు నా వెంటనుండ నా కేకొదువయు రానేరదు. సుఖముగానే తిరిగివత్తము,

రాముడు — వానికి మాత్ర మిష్టములేదా యేమి! మంచిపిల్లను బెండ్లి చేయుటకు వాని తండ్రి నిశ్చయించెనట . అందుల కడ్డుచెప్పుచున్నాడు.

ప్రవరుఁడు — ఆ మాత్రపుకన్య లాదేశములో దొరకకపోరు. స్వయముగా మనము చూచి పెండ్లి చేసికొనుట లెస్స.

దండుఁడు — పదుఁడు పదుఁడు మీ యభిలాషలన్నియుఁ దీరఁగలపు. దేవతాస్త్రీలనే పెండ్లియాడి వత్తము.

వసంతుఁడు – అందఱును సమ్మతించిరి గదా. పోవుటకుఁ గాలనిరూపణము చేయుఁడు.

ప్రవరుఁడు — ఎప్పుడో యననేల రేపురాత్రిఁ పండ్రెండుగంటలు గొట్టినతోడనే గుఱ్ఱములెక్కి యూరిబయలనున్న చూతవనములోనికి రావలయు. నింతయేని జాగు సేయరాదు. అందఱము గలిసికొనిన తరువాతఁ బశ్చిమమార్గంబునఁ బోవుదము.

దండుఁడు - మిక్కిలి వెలగల రత్నములను బంగారమును దగిన యాహారపదార్థములు మూటగట్టుకొని యందఱు రావలయు నిదియే ప్రమాణవచనము.